సినిమాలలో యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా అనుకోని ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అమితాబ్‌బచ్చన్ 'కూలీ' చిత్రం సమయంలో ప్రాణం చివరి వరకు వెళ్లి బతికాడు. అందుకే స్టార్స్‌కి రిస్కీషాట్స్ వచ్చినప్పుడు డూప్‌లను వాడుతారు. అయినా డూప్‌లవి కూడా ప్రాణాలే కదా..! అనేది మర్చిపోతారు. ఇక సినిమా షూటింగ్‌లలో చెంపల మీద కొట్టడం, విలన్లను కొట్టినప్పుడు నిజంగానే దెబ్బలు జరుగుతూ ఉంటాయి.
ఇక విషయానికి వస్తే కోలీవుడ్‌లో ఓ ఊపు ఊపుతోన్న తెలుగమ్మాయి అంజలి 'లీసా' అనే చిత్రంలో నటిస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా ఆమె దోసె పెనంని కెమెరా ముందుకు విసిరివేయాలి. డైరెక్టర్ అన్నట్లుగానే అంజలి చేసింది. అయితే ఆ పెనం గురి తప్పి దర్శకుడి మొహాన్ని బలంగా తాకడంతో తీవ్ర గాయం అయింది. ఆయన కనుబొమ్మల మధ్య చిట్లి గాయం కావడంతో ఆసుపత్రిలో కుట్లు వేశారు.
దీంతో అంజలి బాధపడుతుంటే.. ఇలాంటివి కామనే అని ఆమెకి యూనిట్ సభ్యులతో పాటు దర్శకుడు కూడా సర్దిచెబుతూ, ఆమెలోని గిల్టీనెస్‌ని పొగొట్టే ప్రయత్నం చేస్తున్నారట....!