విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా సినీ రంగంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన దివంగత ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. ఈ చిత్రంలో నందమూరి నటసింహం బాలకృష్ణ తన తండ్రి పాత్రను చేస్తుండగా, ఎన్టీఆర్ సతీమణి, బాలయ్య తల్లి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఇటీవల వీరిద్దరి మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసినట్లు సమాచారం.
ఇక అందరు ముందు నుంచి అనుకుంటూ ఉన్నట్లే ఎన్టీఆర్ అల్లుడిగా, ప్రస్తుతం ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తున్నాడు. ఈయన చంద్రబాబు పాత్రను పోషించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. బాబు పాత్రను రానానే చేయాలని క్రిష్ పట్టుబట్టడంతో పాటు గతంలో క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రంలో కూడా నటించిన రానా ఈ చిత్ర దర్శకుడు క్రిష్ పట్టుబట్టడంతో ఈ పాత్రకు ఓకే చెప్పాడు. ఇటీవలే రానా మీద టెస్ట్ షూట్ కూడా చేశారు. చంద్రబాబు మేనరిజమ్స్, గెటప్‌తో రానా రిహాల్సల్స్ కూడా చేశాడట. ఈ గెటప్‌లో రానా కనిపించిన విధానం క్రిష్‌ని బాగా మెప్పించింది. చంద్రబాబు మంత్రి అయ్యాకే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నాడు.
ఇక ఈ పెళ్లి ఎపిసోడ్‌తో పాటు ఎన్టీఆర్ రాజకీయాలలో కూడా కీలకపాత్ర పోషించిన చంద్రబాబు పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యం ఉండటంతో రానా ఓకే చెప్పాడు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ రానా మీదనే ఉండనుంది. ఇక ఈ చిత్రాన్ని బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణు ఇందూరిలు నిర్మిస్తున్నారు. ఈ సెట్‌లోకి రానా అడుగుపెట్టిన సందర్భంగా బాలకృష్ణ, క్రిష్‌లతో రానా తీసుకున్న సెల్ఫీని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ' ఓ గొప్పవ్యక్తిని గురించి చెప్పేందుకు మేం కలిశాం' అని ట్వీట్ చేశాడు.