అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సుమంత్ సోదరి, నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియ 1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇది పవన్‌కళ్యాణ్‌కి మొదటి చిత్రం. ఈ చిత్రం తర్వాత పవన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా పవర్‌స్టార్ అయిపోయాడు. కానీ సుప్రియ మాత్రం మరో చిత్రంలో కనిపించలేదు. మరలా ఆమె 22ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా విడుదలైన అడవిశేష్ చిత్రం 'గూఢచారి' ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమెది అతిధి పాత్ర అని ప్రచారం సాగింది. కానీ ఇందులో ఆమె సినిమా మొత్తం కనిపించే కీలకపాత్రలో కనిపించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది.
సుప్రియ ఇందులో రా ఆఫీసర్ నదియా ఖురేషి పాత్రలో నటించింది. మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా అదరగొట్టింది. అడవి శేష్ తదితరులు ఉన్న త్రినేత్ర టీంకి ఆమె క్రావ్ మగ అనే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చే పాత్రలో అద్భుతంగా నటించింది. 'గూఢచారి'కి మంచి హిట్ టాక్, సుప్రియ పాత్రకు ప్రశంసలు లభిస్తూ ఉండటంతో ఈ చిత్రం ఆమెకి గ్రాండ్ రీఎంట్రీగా మిగులుతుందని భావించవచ్చు. ఈ సినిమాలో ఆమె నటన చూసిన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇక ఆమెకి స్పెషల్ రోల్స్‌ని సిద్దం చేసి ఆఫర్ చేయడం ఖాయంగా కనిపోస్తోంది. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా కూడా పరిచయం అయిన శశికిరణ్‌కి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇక ఈ చిత్రంలో అడవిశేష్ నటన చూసిన స్టార్ రైటర్ కోనవెంకట్ మాట్లాడుతూ ఏకంగా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ ఎంతగా మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడో తెలుగు అమీర్‌ఖాన్‌గా అడవి శేషుని చెప్పుకోవచ్చని చెప్పడం అడవి శేషుకి లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పవచ్చు. మొత్తానికి 'క్షణం'తర్వాత మరోసారి అడవిశేష్ పూర్తి స్థాయి హీరోగా నటించిన ఈ చిత్రం కూడా ఘనవిజయం దిశగా సాగుతుండటం విశేషం.