లోకనాయకుడు కమల్‌హాసన్ నటించిన 'విశ్వరూపం' చిత్రం మొదటి భాగం 2013లో విడుదలైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆ చిత్రం విడుదలైన ఏడాదిలోపే దాని సీక్వెల్‌ని కూడా రిలీజ్ చేయాలని కమల్ భావించాడు. నిజంగా అలా జరిగి ఉంటే చిత్రానికి మంచి క్రేజ్ వచ్చి ఉండేది. కానీ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడంతో ఈ చిత్రం విడుదల ఐదేళ్లు ఆలస్యం అయింది. ఇలా బాగా ఆలస్యం అయిన చిత్రాలు క్రేజ్ పోగొట్టుకోవడం సహజం. అంతేకాదు.. ఇలా లేటయిన చిత్రాలు విజయం సాధించిన సంఘటనలు కూడా అరుదు. ఇక 'విశ్వరూపం 2'ని విధిలేని పరిస్థితుల్లో కమల్ స్వంతం చేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్స్ పూర్తి చేసి ఈనెల 10వ తేదీన విడుదల చేయడానికి సిద్దపడుతున్నాడు.
ఇక ఈ చిత్రం బిజినెస్ అన్ని భాషల్లో నత్తనడకన సాగుతోందిట. తమిళంలో కమల్ ఎలాగోలా మేనేజ్ చేస్తాడు గానీ తెలుగులో మాత్రం ఈ చిత్రం బిజినెస్ జరగలేదని తెలుస్తోంది. దీంతో తెలుగుపై కమల్ దృష్టి పెట్టాడు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆయన తెలుగు బిగ్‌బాస్ సీజన్2కి కూడా అటెండ్ అయ్యాడు. ఇలా బిగ్‌బాస్ పార్టిసిపెంట్స్‌కి అతి పెద్ద సర్‌ప్రైజ్ కమల్ రూపంలో వచ్చింది. ఆయన హౌస్‌లోకి వచ్చి పోటీ దారులతో కాసేపు గడిపారు. సినిమా ట్రైలర్‌ని బిగ్‌బాస్ హౌస్ పార్టిసిపెంట్స్‌కి చూపించాడు. ఇందులో హీరోయిన్ పూజా కుమార్, సంగీత దర్శకుడు జిబ్రాన్, సినిమాటోగ్రాఫర్ దత్తులను కూడా తీసుకుని వచ్చి పరిచయం చేశాడు. కమల్‌ని అలరించేందుకు రోల్‌రైడా, అమిత్, గీతామాధురి తమ టాలెంట్‌ని చూపించారు. కమల్ కూడా భారతీయుడు చిత్రంలోని 'అదిరేటి డ్రస్ మీరేస్తే' పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేశాడు.
ఇక వీక్షకులకు ఆయనిచ్చిన పెద్ద సర్‌ప్రైజ్ మరోటి ఉంది. అది ఏమిటంటే.. హౌస్‌లోని ఒకరికి రెండు వారాలు ఎలిమినేట్ కాకుండా పవర్ ఇస్తానని ఆయన చెప్పాడు. బాగా ఆడుతున్న వారికి ఈ పవర్ ఇవ్వనని, కాస్త వెనుకబడిన వారికి ఆ పవర్ ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. ఈ లక్కీ చాన్స్‌ని ఆయన అమిత్‌కి ఇచ్చాడు. దీంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన అమిత్ కమల్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. ఇలా కమల్ పుణ్యాన అమిత్ రెండు వారాల పాటు సేఫ్ అయ్యాడనే చెప్పవచ్చు.