ఈ మధ్యన టాలీవుడ్ లో బ్రహ్మానందం కామెడీని మరిచిపోతున్న ప్రేక్షకులకు వెన్నెల కిషోర్ కామెడీతో మళ్ళీ ప్రేక్షకుల్లో ఆశలు చిగురింప చేశాడు. అమీ తుమీ, ఆనందో బ్రహ్మ ఇలా చాలా సినిమాల్లో వెన్నెల కిషోర్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా మారిపోయాడు. సునీల్, సప్తగిరి, జబర్దస్త్ శంకర్ లాంటి వాళ్ళు హీరోలమంటూ సినిమాలు చేసుకుంటూ కామెడీని వదిలేశారు. అయితే తాజాగా సునీల్ కమెడియన్ గా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ ఈ గ్యాప్ లో వెన్నెల కిషోర్ ఇండస్ట్రీలో కమెడియన్ గా పాతుకుపోయాడు. ఏ సినిమాలో చూసిన వెన్నెల కామెడీనే హైలెట్ అవుతూ వస్తుంది. దర్శకుడు మనసు పెట్టి వెన్నెలకి కామెడీ రాయాలి కానీ తనవంతు కామెడీని ప్రేక్షకులకు పంచుతున్నాడు.
మరి స్టార్ కమెడియన్ గా ఎదిగిన వెన్నెల కిషోర్ ఒకేరోజు రెండు విజయాలను సొంతం చేసుకున్నాడు. నిన్న శుక్రవారం వెన్నెల కిషోర్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో సుశాంత్ - రుహనా - రాహుల్ రవీంద్రన్ కాంబోలో వచ్చిన చి.ల.సౌ, అడివి శేష్ గూఢచారి. ఈ రెండు సినిమాల్లో వెన్నెల హాస్యం బాగానే పండింది. చి.ల.సౌ లో వెన్నెల కిషోర్ సుశాంత్ ఫ్రెండ్ గా మంచి కామెడీ పండించాడు. సినిమాలో కథ డ్రాప్ అవుతున్నప్పుడల్లా.. వెన్నెల తన కామెడీతో పైకి లేపాడనే టాక్ ప్రేక్షకుల నుండి వినబడుతుంది. కేవలం వెన్నెల కామెడీనే కాదు.. చి.ల.సౌ కి ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా పాజిటివ్ మార్కులు వేసి హిట్ చేశారు. అలా వెన్నెల ఈ సినిమా హిట్ లో భాగమయ్యాడు.
ఇక రెండో సినిమా అడివి శేష్ - శోభిత ధూళిపాళ్ల కాంబోలో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన గూఢచారి సినిమా కూడా హిట్ అవడంతో వెన్నెల ఒకే రోజు రెండు హిట్స్ ని సొంతం చేసుకున్నాడు. గూఢచారి సినిమాలో ఐబీ ఆఫీసర్‌గా వెన్నెల కిశోర్ కామెడీ అక్కడక్కడా బాగానే వర్కౌట్ అయ్యింది. దర్శకుడు ఇంకాస్త మనసు పెట్టి ఉంటే వెన్నెల కిషోర్ నుండి మరింత కామెడీని రాబట్టొచ్చు. ఇక ఈ సినిమాలో అడివి శేష్.... జేమ్స్ బాండ్ స్టైల్లో ఉంది అని అంటే.. కాస్త బడ్జెట్ తక్కువ అని వెన్నెల కిషోర్ ఓ డైలాగ్ చెప్పినట్లు.. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి అదిరే హిట్ కొట్టింది. మరి ఇలా అనుకోకుండా వెన్నెల కిషోర్ రెండు సినిమాలు ఈ శుక్రవారం విడుదలై హిట్ కొట్టాయి. మరి మొన్నామధ్యన అనుకున్నట్లుగా వెన్నెల కామెడీ కోసం స్టార్ హీరోలేమైనా క్యూ కడతారేమో చూద్దాం.