మ్యాక్ ల్యాబ్స్. ప్రై. లిమిటెడ్ పతాకంపై హరీష్ వడ్‌త్యా దర్శకత్వంలో మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్‌టైనర్ 'తెలంగాణ దేవుడు'. ఈ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు సాగర్ పూజా కార్యక్రమాలు నిర్వహించగా, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మయూద్దీన్ క్లాప్ కొట్టగా, ఎస్.ఎ. గ్రూప్ ఛైర్మన్ సయ్యద్ అక్తర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు హరీష్ వడ్‌త్యా మాట్లాడుతూ..సాగర్ శిష్యుడిగా ఆయన దగ్గర పలు చిత్రాలకు పనిచేశాను. ఇది నా మొదటి సినిమా. ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంటూ మంచి మెసేజ్‌తో ఆకట్టుకుంటుందీ చిత్రం. సీనియర్ నటీనటులందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి.. అన్నారు.
చిత్ర నిర్మాత మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. చిత్ర ఓపెనింగ్‌కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సింగిల్ షెడ్యూల్ ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం. ఈ కథలో మంచి మెసేజ్ ఉంది. ఇలాంటి కథతో నిర్మాతగా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది.. అన్నారు.
జిషాన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, అలీ, సుమన్, నామాల మూర్తి, కేదార్ శంకర్, సూర్య, ప్రగతి, ప్రభావతి, తోటపల్లి మధు, కోటేశ్ మానవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మూలకథ: మహమ్మద్ జాకీర్ ఉస్మాన్, సంగీతం: నందన్ రాజ్ బొబ్బిలి, ఆర్ట్: హరిబాబు, కెమెరా: ఎ. విజయ్ కుమార్, ఫైట్ మాస్టర్: డ్రాగన్ ప్రకాశ్, కొరియోగ్రఫీ: భాను, ప్రొడక్షన్ కంట్రోలర్: బి. రవికుమార్, నిర్మాత: మహమ్మద్ జాకీర్ ఉస్మాన్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్ వడ్‌త్యా.