తమిళంలోనే కాదు.. తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి మార్కెట్, గుర్తింపు ఉండి లోకనాయకుడుగా, విశ్వనటునిగా పేరు తెచ్చుకున్న నటుడు దిగ్రేట్ కమల్‌హాసన్. ఇక ఈయన నటించి దర్శకత్వం వహించిన 'విశ్వరూపం' చిత్రం జయలలిత వల్ల తమిళనాడులో కంటే తెలుగులో ముందుగా విడుదలై కోలీవుడ్ కంటే టాలీవుడ్‌లోనే మంచి హిట్‌ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' షూటింగ్ పూర్తి చేసుకుని ఎంతో కాలం అయింది. కానీ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చేతులు ఎత్తేయడంతో కమలే దాని హక్కులను తీసుకుని, తానే నిర్మాతగా, దర్శకునిగా, హీరోగా 'విశ్వరూపం 2'ని ఆగస్టు 10న విడుదల చేస్తున్నాడు.
ఈ చిత్రం ట్రైలర్‌ని చూస్తే అందరు కమల్‌ని దేశం గర్వించదగ్గ నటుడని, విశ్వనాయకుడని, లోకనాయకుడని ఎందుకు పిలుస్తారో అర్ధమవుతోంది. ఇందులో తీవ్రవాదాన్ని నిర్మూలించే రా ఆఫీసర్ కథగా ఇది ఉంటుందని అర్దమవుతోంది. మరోవైపు ఆండ్రియా పాత్రను కూడా రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేశారు. ఇక రాహుల్‌బోస్ కమల్‌హాసన్‌ని ఉద్దేశించి 'వాడు అల్‌ఖైదాకే శిక్షణ ఇచ్చినవాడు' అనే డైలాగ్ బాగా పేలింది. ఇక పూజాకుమార్ పాత్రలను కూడా సస్పెన్స్‌లోనే ఉంచారు.
ఇక ఈ చిత్రంలో దర్శకత్వపరంగా, స్క్రీన్‌ప్లే పరంగా కూడా కమల్ తనది నేషనల్ స్థాయి కాదు... ఇంటర్నేషనల్ స్థాయి అని నిరూపించుకున్నాడు. ఇక ఈ చిత్రం ఆడియో, ప్రమోషన్స్ కోసం కమల్ హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా రానా దగ్గుబాటి కమల్‌ని కలిశాడు. ఆయనతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఏడాదిలో నేర్చుకునేది ఒక్క గంటలోనే నేర్చుకున్నారంటే మీరు ఓ గొప్ప వ్యక్తిని కలుసుకున్నట్లే.. అంటూ కమల్‌ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఇక 'విశ్వరూపం 2' చిత్రం అన్ని భాషల్లో ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.