మన దేశంలో మరీ మన రాష్ట్రంలో పెళ్లిళ్లు అంటే జీవితంలో ఒకసారే వచ్చే అద్భుతమైన మరిచిపోలేని రోజు. ఆ తీపి జ్ఞాపకాలు జీవితాంతం మదిలో నిలిచే ఉంటాయి. ఇక ఎవరి పెళ్లి అయినా ఆ రోజు ఆ వేడుకకు పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెలే అసలైన హీరోహీరోయిన్లు. ఇక ఇలాంటి పెళ్లి నేపధ్యంలో చిత్రం తీస్తే తెరనిండా నటీనటులతో అది కళకళలాడుతూ ఉంటుంది. మహిళలు, ఫ్యామిలీలు నేడు కేవలం టివిలకే పరిమితం అవుతున్నారన్నది నిజం కాదు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, శతమానం భవతి' వంటి చిత్రాలు వాటిని నిరూపించాయి. కథ పాతదే అయినా తమదైనశైలిలో విభిన్నంగా చూపిస్తే ఆయా చిత్రాలను సకుటుంబ సపరివార సమేతంగా చూసే ప్రేక్షకులు ఉన్నారు.
ఇక విషయానికి వస్తే త్రివిక్రమ్‌తో చేసిన 'అ...ఆ' చిత్రం నితిన్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నమోదైంది. కాగా ఆ తర్వాత వచ్చిన 'లై, చల్‌మోహన్ రంగ' చిత్రాలు నిరాశ పరిచాయి. దాంతో ఆయన ఇప్పుడు 'దిల్' చిత్రం తర్వాత 15ఏళ్ల గ్యాప్‌లో మరోసారి నితిన్ దిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్న దిల్‌రాజు నిర్మాణంలో, 'శతమానం భవతి' దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' రూపొందుతోంది. ఇందులో నితిన్, రాశిఖన్నాలు అద్భుతంగా నటించారని టాక్ బయటికి వచ్చింది.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని సూపర్‌స్టార్ మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే కళ్యాణవైభోగమే అని, నిత్య కల్యాణం పచ్చతోరణం వంటి పదాలు గుర్తుకు వచ్చేలా ఈ ట్రైలర్ ఉంది. మిక్కిజెమేయర్ అందించిన పాటలు మెలోడీలుగా మంచి స్పందననే రాబట్టాయి. 'పెళ్లంటే పెద్ద పండుగ' అని జయసుధ చెప్పే డైలాగ్ ఆకట్టుకోగా, పెళ్లి వేడుకను అద్భుతంగా చూపించారు. నితిన్, రాశిఖన్నాలుక్స్‌తో పాటు ప్రకాష్‌రాజ్, జయసుధ, రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ వంటి వారు పోషిస్తున్న కీలకపాత్రలు ఆకట్టుకుంటున్నాయి. దిల్‌రాజుకి అచ్చివచ్చిన వెంకటేశ్వరుని పేరుతో శ్రీనివాస కళ్యాణం ఉండటం కూడా సెంటిమెంట్ పరంగా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ చిత్రం ఆగష్టు9న విడుదల కానుంది.