పవన్‌కళ్యాణ్ పెద్దగా మాట్లాడడు. కానీ ఒకసారి మాట్లాడటం మొదలుపెడితే మాత్రం ఆ ఒక్కసారే అన్నింటిని మాట్లాడేస్తాడు. తన బంధువులు, ఫ్యామిలీ, సన్నిహితులతో మాట్లాడిన విధంగా ఆయన ప్రజలకు కూడా నిర్మోహమాటం లేకుండా అన్ని విషయాలను చెబుతాడు. ఇక తాజాగా పవన్ మాట్లాడుతూ, మహిళలకు భద్రత లేకపోవడం దారుణమని, దీనిని పోలీసులు ఒక్కరే అడ్డుకోలేరని, ప్రజలలో కూడా చైతన్యం వచ్చి ఎవరైనా మహిళను ఏడిపించే వారికి బుద్ది చెప్పాలని అన్నాడు. సినిమా తెరపైన 20మందిని కొట్టేసే నేను, నిజజీవితంలో నా పక్కన జరిగే అన్యాయాలను ఖండించకపోతే ఇక నాకు ఏం విలువ ఉంటుంది? అని ప్రశిస్తూ, 'పంజా', 'తమ్ముడు' చిత్రాల షూటింగ్‌లలో కొందరు నటీమణులను వేధించినప్పుడు చేతికి కూడా పనిచెప్పానని చెప్పాడు.
ఇక ఇలా చేయి చేసుకోవడం తప్పు కదా అని ప్రశ్నిస్తే ప్రతి విషయంలోనూ పోలీసులకు చెప్పాలంటే వీలుకాదు. ఎవరైనా మహిళలను ఏడిపిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే పోలీసులు వచ్చేదాకా మనం చూస్తూ ఉండలేం. అలాంటప్పుడు ఓ బాధ్యతాయుతమైన పౌరునిగా వారిని మందలించడం తప్పులేదు. చిన్నప్పుడు మా అక్క, చెల్లెళ్లను కూడా ఎందరో ర్యాగింగ్ చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నన్ను తిట్టిన వారిని, విమర్శించిన వారి మాటలను పట్టించుకోను. జగన్ ఈమధ్య నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేశాడు. నేను కూడా అదే స్థాయిలో స్పందించవచ్చు. కానీ నాకు వారి ఇంట్లోని ఆడపడుచులు, తల్లి, బిడ్డలు, సోదరీమణులు గుర్తుకు వస్తారు. నేను జగన్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే వారి ఇంట్లోని వారు ఎంత బాధపడుతారో నేను ఊహించగలను. ఓ అమ్మాయి తిట్టినా కూడా నేను అదే విధంగా ఆలోచించాను. మా అమ్మ, అక్కాచెల్లెళ్లు, వదిన వంటి వారి మధ్య పెరిగిన వాడిని నేను. నాకు చదువు అబ్బక, మనసుకి ఎక్కిన పరిస్థితుల్లో వదినగారు నాకు చేసిన సాయం మర్చిపోలేను. జనసేన పార్టీలోని వారందరు వివిధ నేపధ్యాల నుంచి వచ్చిన వారే. అందరం కలిసి సహృదయ భావాలతో కలిసి పనిచేద్దాం. దీర్ఘకాలిక ప్రయోజనాలు, ఫలితాలు దృష్టిలో ఉంచుకుని ముందుకు నడుద్దాం. మన భవిష్యత్తు తరాలకు మంచి సమాజాన్ని, పటిష్టమైన విధానాలను అందిద్దాం.. అంటూ హైదరాబాద్‌లో జరిగిన 'వీరమహిళావిభాగం' సమావేశంలో జనసేన అధినేత చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా టిడిపి తెలంగాణలో సీనియర్ దళితనాయకుడైన మోత్కుపల్లి నరసింహులు టిడిపి నుంచి బహిష్కరణ వేటు పొందారు. దాంతో ఆయన తాజాగా పవన్‌తో మంతనాలు జరపడంతో జనసేన పార్టీ తెలంగాణకు జనసేన అధ్యక్షునిగా గానీ, రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా గానీ ఆయనను పవన్ నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.