యూనివర్శల్ హీరో కమల్‌హాసన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వరూపం' సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న 'విశ్వరూపం-2' చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత క్యూరియాసిటీ ఆడియన్స్‌లో నెలకొని వుంది. ఆండ్రియా, పూజా కుమార్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్‌ని అందించారు. ఆస్కార్ ఫిలిం ప్రై. లిమిటెడ్ వి. రవిచంద్రన్ బేనర్‌పై రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సమర్పణలో ఎస్. చంద్రహాసన్, కమల్‌హాసన్ నిర్మించిన 'విశ్వరూపం-2' చిత్రం ఆగస్ట్ 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల అవుతుంది. కాగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం ఆగస్ట్ 2న హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్, హీరోయిన్స్ ఆండ్రియా, పూజా కుమార్, సంగీత దర్శకుడు జిబ్రాన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఎ.పి. ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెండ్ వీరినాయుడు, తెలుగు ఫిలిం చాంబర్ కార్యదర్శి ముత్యాల రామదాసు, ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు, ఏషియన్ ఫిలింస్ అధినేత నారాయణ్ దాస్, టి.ఎమ్.టి. ఎండి సుమన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 'విశ్వరూపం-2' ఆడియో సీడిలను యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్ రిలీజ్ చేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
యూనివర్శల్ హీరో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. నన్ను స్టార్‌గానే కాదు.. నాకున్న ప్యాషన్ ఇంకా కొనసాగుతుందంటే అందుకు తెలుగు ప్రేక్షకుల ప్రేమే కారణం. నేను తెలుగు వాడిని, మలయాళీవాడిని.. ఐ యామ్ ఇండియన్ అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను. అది ప్రేక్షకులు, అభిమానుల పంచిన ప్రేమ కారణంగానే సాధ్యమైంది. నాకన్నా పెద్దవాళ్లు నన్ను ఆశీర్వదిస్తే.. నాకన్నా చిన్నవాళ్లు ప్రేమను చూపించారు. నన్ను నటన పరంగా అత్యున్నత స్థితికి తీసుకెళ్లిన సినిమాలన్నీ తెలుగు సినిమాలే. అది టాలెంట్ అనడం కంటే అదృష్టం అని చెప్పాలి. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. విశ్వరూపం మా దృష్టిలో ఒకే సినిమా. రెండు భాగాలుగా విడుదల చేస్తున్నాం. హార్డ్‌వర్క్‌ను, కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తారనే నమ్మకంతో చేసిన సినిమా. 'విశ్వరూపం' పార్ట్ వన్ కంటే ఇంకా బెటర్‌గా పార్ట్ 2ను చేశాం. ఆగస్ట్ 10 కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాం. ప్రేక్షకులు అందించిన అభిమానంతో మరో పార్శ్వంలోకి ప్రవేశిస్తున్నాను. మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను తినేది, వేసుకునే దుస్తులు.. అన్నీ ప్రేక్షకులు ఇచ్చినవే. అందరూ కలిసి నాపై ఇన్‌వెస్ట్ చేశారు. మీ ప్రొడక్ట్ అయిన నేను ఇప్పుడు ఆయుధంగా మారాను. మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. మన ఫ్రీడమ్ కోసం మళ్లీ మనం పోరాడాల్సిన తరుణం వచ్చింది' అన్నారు.
పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ..కమల్‌హాసన్‌గారి 'విశ్వరూపం-2' గురించి మాట్లాడే అనుభవం నాకు లేదు. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇవాళ ఆయన సినిమాకి పాటలు రాసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. కమల్‌హాసన్‌గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సినిమాల ద్వారా ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. ఈ చిత్రంలో మూడు పాటలు వున్నాయి. తమిళంలో వున్న పాటల్ని తెలుగులోకి అనువదించాను. 'జాతి మతాల' సాంగ్ కమల్‌గారే రాశారు. అలాగే అమ్మ పాట ఒకటి ఆయన స్వయంగా పాడారు. ఆయనతో ఈ సినిమాకి కలిసి పని చేయడం సంతృప్తిగా సంతోషంగా వుంది..అన్నారు.
సంగీత దర్శకుడు జిబ్రాన్ మాట్లాడుతూ..ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. నా ఫస్ట్ ఫిల్మ్ కమల్‌హాసన్‌గారితోనే చేశాను. 'విశ్వరూపం-2' చిత్రానికి వర్క్ చేయడం ఓ మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. రామజోగయ్య శాస్త్రిగారు తెలుగులో చక్కని పాటలు రాశారు.. అన్నారు.
హీరోయిన్ ఆండ్రియా మాట్లాడుతూ..ఈ సినిమా ఇన్‌క్రెడిబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. కమల్‌హాసన్‌గారితో వర్క్ చేయడం నా అదృష్టం. ఆయనొక నట శిక్షణాలయం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వెరీ డిసిప్లిన్ పర్సన్. ఈ చిత్రంలో మిలటరీ ఆఫీసర్‌గా నటించాను. ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ చేయడం గర్వంగా ఫీలవుతున్నాను. ఈ సినిమాని ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు' అన్నారు. మరో హీరోయిన్ పూజా కుమార్ మాట్లాడుతూ - విశ్వరూపం-2 చిత్రం కోసం నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. కమల్‌హాసన్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా భావిస్తున్నాను..అన్నారు.