కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజుల్లో సునీల్ బ్రహ్మానందంకు కూడా గట్టిపోటీ ఇచ్చాడు. బ్రహ్మీతో సినిమాల సంఖ్యలోనే కాదు.. రోజు వారి పారితోషికాల విషయంలో కూడా ఆయన బ్రహ్మీతో సమానంగా క్రేజ్, ఇమేజ్ సాధించాడు. అలా ఏడాదికి 15 నుంచి 20 చిత్రాల వరకు సునాయాసంగా చేస్తూ ఆర్దికంగానే గాక కమెడియన్‌గా కూడా ఓ వెలుగు వెలిగాడు. కానీ ఆయన కమెడియన్ పాత్రలకు ఫుల్‌స్టాప్ పెట్టి హీరోగా మారడంతో ఏడాదికి రెండుమూడు చిత్రాలు చేయడమే గగనమైపోయేది. ఇలా హీరోగా కూడా ఆయన కమెడియన్ స్థాయి గుర్తింపును గానీ, డబ్బును గానీ సాధించలేకపోయాడు. అలా ఆయన రెంటికి చెడ్డ రేవడిలా మారాడు. ఇలా తన స్వీయకృతాపరాధం వల్లనే ఆయన కెరీర్ ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతోంది.
కేవలం ఆయన కెరీర్‌లో 'అందాల రాముడు, మర్యాదరామన్న, పూలరంగడు, తడాఖా' వంటి హిట్స్ మాత్రమే ఉన్నాయి. చివరకు ప్రతి ఒక్కరు ఒక్క సీన్‌లోనైనా నటించాలని కలలు గనిన మెగాస్టార్ చిరంజీవి దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇచ్చి, తన 150వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఖైదీనెంబర్ 150'లో చిరు పిలిచి అవకాశం ఇస్తానన్నా కూడా ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన హీరోగానే కాకుండా కమెడియన్‌గా కూడా నటించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపధ్యంలో ఆయన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో మరో ఫ్లాప్‌లో ఉన్న కమెడియన్ అల్లరినరేష్‌తో కలిసి 'సిల్లీ ఫెలోస్' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు ఆయన కమెడియన్‌గా కూడా రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ', త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రాలలో చేస్తున్నాడు.
గతంలో హీరోగా 4కోట్ల పారితోషికం తీసుకున్న సునీల్ ప్రస్తుతం తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నాడని సమాచారం. 'సిల్లీ ఫెలోస్' చిత్రానికి కేవలం ఒకటిన్నరకోటి మాత్రమే తీసుకున్నాడట. ఇక 'అమర్ అక్బర్ ఆంటోని, అరవింద సమేత వీరరాఘవ' చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో వీటికి కోటి రూపాయలు తీసుకుంటున్నాడని సమాచారం. మొత్తానికి సునీల్ కమెడియన్‌గా మరలా బిజీగా మారితే ప్రేక్షకులకు కూడా ఆనందమే మరి...!