జీవితంలో అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు ఏదో అవుదామని చేసిన పనులు నిజంగానే నిజమవుతాయి. మరికొన్నిసార్లు మనం చేసే ఏదో చిన్నపనే మనకి ఖ్యాతికి, జీవితం మలుపుతిరగడానికి కారణభూతం అవుతుంది. ఇక సినీ రంగంలో దిగ్గజ రచయితలుగా పేర్కొనదగ్గ పరుచూరి బ్రదర్స్‌లోని పరుచూరి గోపాలకృష్ణ తాజాగా తన జీవితం ఎలా మలుపు తిరిగింది? అనే ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ, ఘంటసాల గారి మరణం... నేను కూడా గొప్పవాడిని కావాలనే కోరికను నాలో పెంచింది. దాంతో నేను పత్తేపురం నుంచి ఉయ్యూరు వచ్చేశాను. పత్తేపురం అనే చిన్నగ్రామంలో నాడు నాకు 750 రూపాయల జీతం వచ్చేది. కానీ నేను ఉయ్యూరు అనే పట్టణానికి వచ్చి దానికంటే ఎంతో తక్కువైన 550 రూపాయల జీతానికి పనికి చేరాను. కానీ దాని వెనుక నాకు పెద్ద వ్యూహమే ఉంది.
ఉయ్యూరుకి పక్కనే విజయవాడ ఉంది. అక్కడికి వెళ్లి దూరదర్శన్‌లోనో, రేడియోలోనో, పత్రికల్లోనో కథలు రాస్తూ గొప్పవాడిని కావాలనేది నా ఆశ. ఘంటసాల గారు మరణించినప్పుడు ఏడ్చేసిన నా స్టూడెంట్స్ నేను ఆ ఊరు వదిలి వచ్చేటప్పుడు కూడా అలాగే ఏడ్చారు. ఇక ఉయ్యూరుకి వచ్చిన తర్వాతనే నేను అనుకున్నది నిజమై నాకు పేరు రావడానికి కారణమైంది. అలా ఆ సంఘటన నా జీవితాన్నిమలుపుతిప్పింది. ఆ మలుపే నన్ను చిత్ర పరిశ్రమకి దగ్గర చేసింది.. అని చెప్పుకొచ్చారు.