కొందరు హీరోలు తమ చిత్రాల ఎంపికలో, వాటి రిలీజ్‌ల విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. దాని వల్లే వారి చిత్రాలే వారికి పోటీగా మారుతూ ఉంటాయి. గతంలో బాలకృష్ణ నటించిన 'నిప్పురవ్వ, బంగారుబుల్లోడు' చిత్రాలు రెండు ఒకే రోజున విడుదల అయ్యాయి. ఇక విషయానికి వస్తే అక్కినేని కుటుంబం వంటి ఎందరో నటీనటులు, అనుభవం, ప్లానింగ్ ఉన్న ఫ్యామిలీ నుంచి యంగ్ హీరో నాగచైతన్య వచ్చాడు. మొదట్లో కాస్త నిరాశపరిచినా కూడా ఆ తర్వాత తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా 'రారండోయ్ వేడుకచూద్దాం' చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కానీ ఆ తర్వాత వచ్చిన 'యుద్దంశరణం' మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. ఇదే సమయంలో చైతు రెండు ఆసక్తికరమైన చిత్రాలను ఒప్పుకున్నాడు. 'ప్రేమమ్' చేసిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలోనే విభిన్న చిత్రంగా, మాధవన్‌ని సైతం ఇంప్రెస్ చేసిన చిత్రం కావడంతో ఇది కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను బాగా అలరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఇక ఇదే సమయంలో పొగరుబోతు అత్త, అలాంటి కూతురు, వారి పొగరును దించే అల్లుడు పాత్రలు.. ఇలాంటి హిట్ ఫార్ములాతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని బాగా పండించగలిగిన 'భలే భలే మగాడివోయ్, మహానుభావుడు' చిత్రాలతో తన సత్తా చాటిన మారుతి దర్శకత్వంలో 'శైలజారెడ్డి అల్లుడు' అనే చిత్రం చేస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు చిత్రాలతో యూత్‌ని, క్లాస్ ఆడియన్స్‌ని, విభిన్న చిత్రాలను ఆదరించేవారిని, మరోవైపు ఫ్యామిలీ ప్రేక్షకులకు అవసరమైన సరుకుతో ఈయన ఈ రెండు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'సవ్యసాచి' చిత్రం ఈనెల 17న విడుదల కానుండగా, మరో 15రోజుల వ్యవధిలోనే ఈనెల 31న 'శైలజారెడ్డి అల్లుడు' రానున్నాడు. దాంతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఈయనే తన చిత్రాలకు తానే పోటీగా మారుతున్నాడు.
ఇక తాజాగా 'శైలజారెడ్డి అల్లుడు' టీజర్ విడుదలైంది. 'ఇప్పుడు నువ్వు ఐలవ్‌యు అని ప్రపోజ్ చెయ్యి.. ఐలవ్‌యు టు అని యాక్సెప్ట్ చేస్తాను'.. అని చైతుతో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ అంటుంది. 'పిట్ట పిట్టలా ఇంతే ఉన్నా' అని నటుడు రఘుబాబు చెప్పడం బాగుంది. 'ఈ పిల్లే ఇలా ఉంటే ఈమె తల్లి ఎలా ఉంటుందో' అని చైతు అనడం, రమ్యకృష్ణ సీరియస్‌గా నడుస్తూ వస్తున్న సీన్ టీజర్‌లో కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో కీలకపాత్ర అయిన అత్తగా రమ్యకృష్ణ నటిస్తుండటం, మరోవైపు 'సవ్యసాచి'లో మాధవన్ నటిస్తుండటంతో ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి.