పర్యావరణం గురించి చిన్నపిల్లలకు ఏమి తెలుసులే అనుకుంటూ ఉంటాం. కానీ అది తప్పు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారికి మంచి చెడు ఏమిటనేవి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలనేది వారి తల్లిదండ్రుల నుంచే పిల్లలు నేర్చుకుంటారనేది వాస్తవం. ఇక నేడు దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే వేధిస్తున్న సమస్య పర్యావరణ పరిరక్షణ. ఇష్టం వచ్చినట్లుగా పారిశ్రామీకరణ పేరుతో, డ్యామ్‌లు, ఇతర అభివృద్ది పనుల పేరుతో అడవులను, చెట్లను నరికేయడం, ఎర్రచందనం వంటి స్మగ్లర్ల వల్ల, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల అత్యాశ కారణంగా ప్లాస్టిక్ నుంచి నీరు, ఊర్లు అన్నీ ప్రకృతి సమతుల్యాన్ని కోల్పోతున్నాయి. దీనికి ఎవరో బాధ్యులు కాదు. మనమే దీనికి బాధ్యత వహించాలి. ప్రజల అత్యాశ, నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతోంది. కాబట్టి దీనిని మరలా తిరిగి పునరుద్దరించవలసిన బాధ్యత కూడా ప్రజల మీదనే ఉంది.
ఇక పిల్లలకు చిన్ననాటి నుంచే మొక్కలు, పచ్చదనం వంటి వాటి ప్రాముఖ్యతను తెలియజేయడం మన కనీస కర్తవ్యం. ఇక విషయానికి వస్తే తెలంగాణ మంత్రి కేటీఆర్, రాచకొండ పోలీసుల గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు మొక్కలు నాటి తన బాధ్యతను పూర్తి చేస్తూ, మరో ముగ్గురిని దీనికి నామినేట్ చేశాడు. ఇందులో మహేష్ పాప సితార, కుమారుడు గౌతమ్‌కృష్ణ ఉండటం విశేషం. అంటే మహేష్ బాధ్యతాయుతమైన తండ్రిగా తన పిల్లలకు మొక్కల ప్రాధాన్యతను పరోక్షంగా చెప్పినట్లే భావించాలి. ఇక సూపర్‌స్టార్ మహేష్ ఇచ్చిన ఛాలెంజ్‌ని ఆయన కుమార్తె బుల్లి సితార, కొడుకు గౌతమ్ కూడా పూర్తి చేశారు. మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోసి చిన్నపిల్లల్లో కూడా ఈ స్ఫూర్తి నింపారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు దర్శకుడు వంశీపైడిపల్లి కూడా మహేష్ విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌కి స్పందించాడు. ఈ ఛాలెంజ్‌కి తనని నామినేట్ చేసిన మహేష్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా వంశీపైడిపల్లి మరో ముగ్గురిని దీనికి నామినేట్ చేశాడు. హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లకు ఆయన గ్రీన్‌ఛాలెంజ్‌ని విసిరాడు. మరి ఈ ఛాలెంజ్‌ని వారు ఎప్పుడు పూర్తి చేస్తారో వేచిచూడాల్సివుంది...!