అన్నిరంగాలలో, అన్ని విషయాలలో ఉన్నట్లే సోషల్ మీడియా వల్ల మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఇక ఈమధ్య సోషల్ మీడియాలో ఛాలెంజ్‌ల జోరు కొనసాగుతోంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ వంటివి వినోదాన్ని అందిస్తున్నాయి. కికి ఛాలెంజ్ వంటివి ప్రమాదాలకు, మరణాలకు కారణం అవుతున్నాయి. ఫిట్‌నెస్ చాలెంజ్‌లు వ్యక్తిగత ఆరోగ్యానికి మంచిని చేస్తుంటే, పర్యావరణానికి హరితహారం (గ్రీన్) ఛాలెంజ్‌లు అండగా నిలుస్తున్నాయి. ఈ విధంగా హరితహారం ఛాలెంజ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో మంత్రి కేటీఆర్ సక్సెస్ అవుతూ, సెలబ్రిటీలకు, ప్రజలను ప్రభావితం చేసే వారిని ఛాలెంజ్‌లో భాగస్తులను చేస్తుండటం హర్షించదగిన పరిణామం. నేటి యువతపై సినీ స్టార్స్ ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తల్లిదండ్రులు, గురువుల మాటే కాదు.. ఎవ్వరి మాటా వినని అభిమానులుకూడా తమ అభిమాన హీరో చెబితే ఏది చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఇక విషయానికి వస్తే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్‌బాబులు హరితహారం ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటారు. మోహన్‌బాబు నుంచి సచిన్, సైనా నెహ్వాల్ వరకు దీనికి బాగా స్పందిస్తున్నారు. ఎన్టీవీ అధినేత నరేంద్రచౌదరి విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి 'సై..రా...నరసింహారెడ్డి' షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్‌లోని ఇంటి పెరట్లో మూడు మొక్కలను నాటారు.
ఆ తర్వాత నేరుగా ఆయన బిగ్ బి అమితాబ్‌బచ్చన్, మీడియా మొఘల్ రామోజీరావు, తమ్ముడు, పవర్‌స్టార్, జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌లను దీనికి నామినేట్‌చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన తమ్ముడు పవన్‌కళ్యాణ్ మాదాపూర్‌లోని తన సంస్థ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి గ్రీన్‌ఛాలెంజ్‌ని పూర్తి చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సెన్సేషన్ అవుతున్నాయి. అన్న అడిగిన వెంటనే.. క్షణాలలోనే పవన్ ఛాలెంజ్ ని స్వీకరించి.. అన్నకే కాకుండా మెగా అభిమానులందరికి షాక్ ఇచ్చాడు. ఇక మెగాస్టార్ నామినేట్ చేసిన వారిలో ఉన్న బిగ్‌బి అమితాబ్‌బచ్చన్, రామోజీరావులు ఈ సవాల్‌ని ఎప్పుడు స్వీకరిస్తారో వేచిచూడాల్సివుంది...!