ఆయనను ఇండస్ట్రీలో పలువురు కోపిష్టి, పొగరు అని భావిస్తారు. కారణం ఆయన ముక్కుసూటితనమే. నిన్నటితరం నిర్మాతల్లో ఎమ్మెస్‌రెడ్డితో పాటు ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె.రాఘవకు కూడా అంత పేరుంది. ఆయన ఏ పని చేసినా, పరిశ్రమలోని సమస్యలకోసం పనిచేసినా ఏ పదవులు ఆశించేవాడు కాదు. ఏది చేసినా ఎంతో గుప్తంగా చేస్తాడనే పేరుంది. ఈయనకు మొదటి నుంచి స్టార్ హీరోలపై మోజు లేదు. వారి కోసం ఆయన వెంపర్లాడింది కూడా లేదు. తనకి కథ, దర్శకులే ముఖ్యం. ఈయన తన కెరీర్‌లో 'తాత మనవడు, జగత్ కంత్రీలు, తూర్పుపడమర, చదువు సంస్కారం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి, అంతులేని కథ, సూర్యచంద్రులు, ఈ ప్రశ్నకు బదులేది?, యుగకర్తలు, నారద వినోదం' వంటి చిత్రాలను నిర్మించారు.
'తాతా మనవడు' ద్వారా దర్శకరత్న దాసరి నారాయణరావుని దర్శకుడిని చేసిన ఘనత ఆయనకే దక్కుంది. సాధారణంగా అందరు దాసరిని గురువు గారు అనిపిలిస్తే, దాసరి చేతనే గురువుగారు అనిపించుకున్న ఘనత కె.రాఘవది. ఇక ఈయన తెలుగు చిత్ర రంగానికి రావుగోపాలరావు, గొల్లపూడి మారుతిరావు, సుమన్, భానుచందర్ వంటి వారిని పరిచయం చేయడమే కాకుండా.. చిరంజీవి హీరోగా నటించిన మొదటి బ్లాక్‌బస్టర్ 'ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య'ని నిర్మించారు. కోడిరామకృష్ణని కూడా దర్శకునిగా పరిచయం చేసింది కె.రాఘవనే. ఇలా స్టార్స్‌ని నమ్ముకోకుండా ఒకనాడు ఆయన నిర్మాతగా ఓ వెలుగువెలిగాడు.
1972లో 'తాతమనవడు', 1973లో 'సంసారం సాగరం' చిత్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుని స్వీకరించారు. వీటితో పాటు అక్కినేని జీవత పురస్కారం, 2012లో రఘుపతి వెంకయ్య అవార్డులను పొందారు. నేటి జనరేషన్ దిల్‌రాజ్‌గా ఆయన నిన్నటితరంలో గుర్తింపు పొందారు. మరోవైపు ఈయన జీవితం కూడా ఎంతో క్రమశిక్షణతో సాగేది. అదే ఆయనకు 105 ఏళ్ల సుదీర్ఘ ఆయుష్షుని అందించింది. ఇక ఈయన కొన్నిరోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గుండె పోటుతో మరణించారు. పలువురు సినీ ప్రముఖులు ఈయన మరణం పట్ల నివాళి అందించారు. నేడు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.