నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్‌కి, ఆయన తండ్రి హరికృష్ణకి ఎంతో ఆప్తుడైన వ్యక్తి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని. ఈయన 'అదుర్స్, ఒక్కక్షణం'తో పాటు 1987లో చిరంజీవి హీరోగా వచ్చిన 'చక్రవర్తి'కి కూడా నిర్మాత. నందమూరి కుటుంబంతో ఇంత అనుబంధం ఉన్న ఆయన గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరాడు. దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ హస్తం ఉందని కూడా చంద్రబాబు, బాలకృష్ణలు నమ్ముతారనే ప్రచారం ఉంది.
ఇక ఈయన తాజాగా తెలుగుదేశం పార్టీపై, టిడిపి నాయకులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. ఈయన మాట్లాడుతూ, మరో 200రోజుల్లో ఎన్నికలు వస్తాయి. 200రోజులు ఆగితే గుడివాడలోని తెలుగుదేశం నాయకులకు చుక్కలు చూపిస్తాను. అధికారులు, పోలీసులు అధికార పార్టీ అయిన తెలుగుదేశంకి తొత్తులుగా మారారు. నన్ను గుడివాడ నుంచి వెళ్లగొడతామని టిడిపి నాయకులు అంటున్నారు. 200రోజులు ఆగితే ఇక్కడ టిడిపిని భూస్థాపితం చేస్తానని శపథం విసిరాడు. అప్పుడు టిడిపి నాయకులను తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది.
వైయస్సార్‌సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్న టిడిపి నేతలకు అసలు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. ఇక గుడివాడలో కొడాలినానితో పాటు వల్లభనేని వంశీ వంటి వారు కూడా నందమూరి అభిమానుల అండతో గెలిచి, ఇప్పుడు ఇలా మాట్లాడటాన్ని వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఇప్పటికీ కొడాలినాని, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు చెప్పుకుంటున్నట్లే నడుస్తున్నాడనే టాక్ మాత్రం ప్రభలంగా వినిపిస్తోంది.