ఒక చిత్రం ఎంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది? అనే విషయాలను ప్రేక్షకులకు నోటి ద్వారా చెప్పకుండా అందులోని భారీ సీన్స్‌కి సంబంధించిన ఫొటోలను లీక్ చేస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయి. 'బాహుబలి' నుంచి '2.ఓ' వరకు ఇదే కోవలోకి పలు చిత్రాలు వస్తాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి 'సైరా..నరసింహారెడ్డి' చిత్రం చేరింది. మెగాస్టార్ చిరంజీవి మెగా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, స్వయాన రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో 'కొణిదెల' బేనర్‌పైనే రూపొందిస్తుండటం విశేషం.
దీనిని 'బాహుబలి' రేంజ్‌లో తీసి దేశవ్యాప్తంగా విడుదల చేసి బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి దేశంలోని అన్ని భాషల నటీనటులను ఎంచుకున్నారు. అమితాబ్‌బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్‌సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్ వంటి మహామహులు ఇందులో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పోరాట సన్నివేశాలకు చెందిన కొన్ని ఫొటోలు తాజాగా లీక్ అయి, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్నిఫొటోలు ఆమధ్య లీక్ అయ్యాయి. మరికొన్నింటి ఒరిజినల్స్‌ని యూనిటే అఫీషియల్‌గా రిలీజ్ చేసింది.
ఇక ఇందులో నటిస్తున్న అమితాబ్‌బచ్చన్ తన గెటప్, చిరు గెటప్‌లకు సంబంధించి తీసిన సీన్స్‌కి సంబంధించిన ఫోటోని సోషల్
మీడియాలో పోస్ట్ చేయడం చూస్తుంటే సినిమా అంచనాలను పెంచే పనిలో భాగంగానే ఇది జరుగుతోందా? అనే అనుమానం వస్తోంది. తాజాగా లీక్ అయిన ఫొటోలలో భారీకోట తగులబడుతున్న ఫొటో ఒకటి కాగా యుద్దానికి సిద్దంగా బ్రిటిష్ జవాన్ల దుస్తుల్లో ఉన్న ఆర్టిస్టు ఫొటోలు ఉన్నాయి. ఈ స్టిల్స్ ఎంతో రిచ్‌గా ఉండటంతో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోందన్న విషయం తేటతెల్లం అవుతోంది...!