ఈమద్య ఐస్‌బకెట్ చాలెంజ్ నుంచి ఫిట్‌నెస్ చాలెంజ్‌ల వరకు పలు పోటీలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు సోషల్‌మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. సమాజానికి మంచి చేసే చాలెంజ్‌ల విషయంలో సెలబ్రిటీలు కూడా ముందుంటున్నారు. ఇక తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు హరితహారం (గ్రీన్)చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాడు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాధరిన్ హడ్డా ఇటీవల ఈ గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మొక్కలను నాటే సవాల్‌ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ద్వారా స్వీకరించి, మోహన్‌బాబుకి ఆ సవాల్‌ని విసిరింది. ఈ నేపధ్యంలో మోహన్‌బాబు స్పందించి మొక్కలు నాటుతున్న ఫొటోలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఇదిగో.. చాలెంజ్‌ని పూర్తి చేశా. విద్యానికేతన్‌లోని మా పిల్లలు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్‌ని స్వీకరించాలని కోరుతున్నాను. మనకు ఇంకా ఎక్కువ పచ్చదనం కావాలి. మీరు మొక్కలు నాటుతున్న ఫొటోలను నాకు పంపండి.. అని మోహన్‌బాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో కీలకం అని తెలుపుతూ ప్రారంభించిన ఈ చాలెంజ్‌ని ఇప్పటికే పలువురు ప్రముఖులు స్వీకరించారు. ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్, దర్శకధీరుడు రాజమౌళి నుంచి సైనానెహ్వాల్, సచిన్, క్యాధరిన్ హడ్డా వరకు ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు.