'కోడి' ఫర్వాలేదనిపించింది. 'విఐపి 2' డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో హీరోగా సూపర్‌స్టార్ ధనుష్ అల్లుడు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ సమయంలో ఆయన రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక తన మావయ్య రజనీకాంత్ హీరోగా వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై 'కాలా' చిత్రం నిర్మించాడు. నిర్మాతగా ఈ చిత్రం ధనుష్‌కి లాభాలను అందించినా కూడా బయ్యర్లను బాగా నష్టపరిచింది. ఇక ఇప్పుడు ధనుష్ మరోసారి హీరోగా 'వడచెన్నై' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేష్, సముద్రఖని, ఆండ్రియా తదితరులు నటిస్తుండగా 'కబాలి, కాలా' చిత్రాలకు సంగీతం అందించిన సంతోష్‌నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
వండర్‌బార్ పతాకంపై ధనుష్ సొంత నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది. ఈ సినిమా టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఇది మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంది. 'ఈ యుద్ధం ఒకరి మరణంతో ఆగిపోదు' అని ధనుష్ చెప్పిన డైలాగ్ బాగా స్పందనను సాధిస్తోంది. యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం టీజర్‌ని కట్ చేశారు. ధనుష్ మునుపెన్నడు లేని మాస్ లుక్‌లో వెరైటీ గెటప్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ టీజర్‌కి యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో టాప్10లో ఉంది. 36లక్షలకు పైగా ప్రేక్షకులు దీనిని వీక్షించారు. చెన్నైలోని ఓ ప్రాంతపు ప్రజల జీవితం ఆధారంగా ఈ 'వడచెన్నై' రూపొందుతోంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.