విజయ్ మాస్టర్, ఆయన శ్రీమతిగారు కలిసి కన్న కలలకు ప్రతి రూపం వారి ఇద్దరు బిడ్డలు... వారు చేసిన 'ఈ మాయ పేరేమిటో' చిత్రం పెద్ద హిట్ కావాలి - యంగ్ టైగర్ ఎన్టీఆర్
సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. కావ్యా థాపర్ హీరోయిన్. వి.ఎస్.వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... 'నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం చేయాలో మొత్తం నేర్పారు విజయ్ మాస్టర్‌గారు. నాకు మూలిగ అంటే ఇష్టం. నా కోసం వాళ్ల ఇంట్లో నుంచి వండి తీసుకొచ్చేవారు. విజయ్ మాస్టర్‌ది ప్రేమ వివాహం. ఆయన శ్రీమతి ఆయన్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని విజయ్ మాస్టర్ ఎప్పుడూ వమ్ము చేయలేదు. చాలా కష్టపడి ఆయన తన జీవితంలో పైకి ఎదిగారు. ఫైట్స్ విషయంలో ఎలాంటి సేఫ్టీ అంశాలు లేని కాలంలో మెరీనా బీచ్‌లో వాళ్లు ప్రాక్టీస్ చేసేవారు. మామూలుగా హీరోలు చేసే ఫైట్లకు అప్లాజ్ వస్తుంది. కానీ వాటిని చేయించిన ఫైట్ మాస్టర్లను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ వారు పడే శ్రమ మెచ్చుకోవాల్సిందే. విజయ్ మాస్టర్, ఆయన శ్రీమతిగారు కలిసి కన్న కలలకు ప్రతి రూపం ఇద్దరు బిడ్డలు. వారిద్దరూ ప్రయోజకులు అవుతుంటే వాళ్ల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి' అని అన్నారు.
పైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ... 'నేను ఇండస్ట్రీకి చాలా రుణపడి ఉన్నా. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు.. మీరేం సాధించారు అని ఒకరు అడిగితే 'ఇండస్ట్రీ అనేది తల్లి. ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే నేర్చుకుంటాం. అంతేగానీ ఇక్కడ సాధించడం ఏమీ ఉండదు' అని అన్నా. శ్రీహరి అన్నని మర్చిపోకూడదు. రామ్ లక్ష్మణ్‌లు మా జర్నీ గురించి చెప్పారు. ఎవరైనా గతాన్ని మర్చిపోకూడదు. జగన్‌గారు చెప్పినప్పుడు మెస్‌లో అలాగే ఉన్నాం. ఎన్టీఆర్ ఆనందంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనేది నా నమ్మకం. మనుషులు కొందరే ఉంటారు. హీరోలు చాలా మంది ఉంటారు. యాక్టర్లు ఉంటారు. మంచి మనసున్న మనిషి ఎన్.టి.ఆర్. నేను ఏం సాధించానో నాకు తెలియదు కానీ, ఎన్టీఆర్ ఫంక్షన్ కి రావడం మాత్రం నా సాధనగానే భావిస్తున్నా. నాకు ఈ క్షణం చాలా ఎమోషన్స్ ఉన్నాయి. శ్యామ్.కె.నాయుడు, ఆర్ట్ డైరక్టర్ చిన్నా.. ఇతర టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. మణిశర్మగారిని రమ్మన్నాను. ఆయన ఎప్పుడూ ఫంక్షన్లకు రారు. ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది. మా పిల్లలు ఇంత దూరం రావడానికి కారణం మా టెక్నీషియన్లు. వాళ్లందరికీ ధన్యవాదాలు' అని చెప్పారు.
హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ... 'ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. శ్రీమణిగారు మంచి పాటలు రాశారు. రీరికార్డింగ్ చాలా బావుంటుంది. సెకండ్ ఆఫ్‌లో రీరికార్డింగ్‌కి ఒళ్లు గగుర్పొడుస్తుంది. శ్యామ్ అంకుల్ సినిమాటోగ్రఫీలో నేను హీరోగా చేయాలని నాన్నతో చాలా సార్లు చెప్పాను. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ నా చిన్నతనంలో నన్ను పెంచారు. వాళ్ల మధ్యలో, వాళ్ల ప్రేమతో పెరిగాను. అందరూ తెలిసిన వాళ్ల మధ్య చేసిన సినిమా కావడం వల్ల నాకు కొత్తగా అనిపించలేదు. అందరి ఇళ్లల్లో జరిగే కథతో ఈ సినిమాను రూపొందించాం. నటీనటులు చాలా మంది ఉన్నారు. వాళ్లందరి దగ్గర నుంచి ఈ సినిమాలో ఎలా పనిచేయాలో నేర్చుకున్నా. వాళ్లందరూ చాలా ఈజ్‌తో యాక్ట్ చేసేవారు. ప్రతి సీన్‌లో వాళ్లు నా చేత అలా చేయించారు. కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా పాత్ బ్రేకింగ్ అని నేను అనను. కానీ మంచి సినిమా చేశాం. ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. మెమరీస్ అన్నీ రీ కలక్ట్ చేసుకుని, మెమరీస్‌ని ఇంటికి తీసుకెళ్తారు. ఈ ప్రపంచం ఎమోషన్స్ ని, డబ్బుని కలగలిపి ఉంటుంది. మేం డబ్బు పెట్టి ఎమోషనల్ మూవీ చేశాం. మా ఫ్యామిలీ అంటే ఈ ఫంక్షన్ కి వచ్చిన వారందరూ. వాళ్లందరూ నా మీద చూపించిన ప్రేమ చాలా గ్రేట్. అమ్మానాన్నలది బాధ్యత. మిగిలిన వారిది ప్యూర్ లవ్. మా నాన్న ఫైట్ మాస్టర్ అయి సెటిల్ కావడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ నన్ను హీరోగా నిలబెట్టడానికి మా నాన్న 70 శాతం కష్టపడ్డారు. నేను పడ్డ కష్టం కేవలం 30 శాతం మాత్రమే. నేను ఈ వేదిక మీద ఉన్నట్టు కాదు, మా ఇంట్లో వాళ్ల భుజాల మీద ఉన్నట్టే. నా గురువులు అందరికీ ధన్యవాదాలు. నా వేదికకు మెట్లలాంటి వారు మా గురువులు. సక్సెస్‌ని ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ఫెయిల్యూర్‌ని చాలా మంది హ్యాండిల్ చేయలేరు. అలా చేయగలిగిన వ్యక్తి ఎన్టీఆర్‌గారు. ఆయన నరసింహుడు షూటింగ్ సమయంలో నేను ఆయనతో కేర్‌వ్యాన్‌లో ఉన్నాను. రైతులకు సంబంధించిన డైలాగులను ఒకసారి చూసుకుని వెళ్లి కెమెరా ముందు నిలబడి ఓకే చేశారు. ఎన్టీఆర్ గొప్పతనం అది. ఆయనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు.' అని అన్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... 'నేను చౌదరి గారి ఇంట్లో ఉండేవాడిని. ఖాళీ ఉంటే మెస్‌లో ఉండేవాడిని. ఫైట్ మాస్టర్ రాజుగారితో పాటు చాలా మంది వచ్చేవారు. అందరూ ర్యాష్‌గా ఉండేవారు. ఒక వ్యక్తి మాత్రం కామ్‌గా ఉండేవారు. ఆయన విజయ్ మాస్టర్. నా తొలి సినిమా భద్రి నుంచి ఆయనతో పనిచేస్తున్నాను. మాస్టర్ కొడుకును హీరోగా, కూతురుని నిర్మాతగా చేస్తూ సినిమా చేస్తున్నారు. వాళ్లింట్లో అందరూ నాకు బాగా తెలుసు' అని అన్నారు.
శాంతి శ్రీహరి మాట్లాడుతూ... 'మా ఇద్దరి పిల్లలతో పాటు రాహుల్ కూడా నాకు ఇంకో కొడుకు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. తను చేసిన సినిమా పెద్ద హిట్ కావాలి' అని చెప్పారు.
నిర్మాత దివ్య మాట్లాడుతూ... 'మా మూవీ పూజ చేసిన రోజు నాకింకా బాగా గుర్తుంది. ఈ ప్రాసెస్‌లో నాకు తెలిసిన విషయం ఏంటంటే సమిష్టి కృషి ఈ సినిమా. శ్యామ్‌గారు, చిన్నాగారు మా నాన్నకు పిల్లర్స్ లాగా పనిచేశారు. రాహుల్, కావ్య చాలా అదృష్టవంతులు. ఎన్టీఆర్ అన్నయ్య మా రాహుల్ ఆడియో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. మేం ఎన్టీఆర్‌గారిని ఇన్వయిట్ చేయడానికి వెళ్లినప్పుడు ఆడియో లాంచ్ అనుకుంటున్నామని అనగానే డేట్ ఏంటి? ఎక్కడ? అని అడిగి ఇప్పుడు వచ్చారు. మా ఫ్యామిలీకి ఎన్టీఆర్ గారికి చాలా బాగా తెలుసు. మణిశర్మగారు వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలు వినండి, సినిమా చూడండి' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు రామ్ కొప్పుల మాట్లాడుతూ... 'నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకలో అందరూ నాన్న గురించి మాట్లాడితే నేను కనెక్ట్ అయ్యాను. అక్కడే కథ మొదలైంది. ఆ కథను నేను విజయ్‌గారికి చెప్పాను. ఆయన ఇక్కడిదాకా తీసుకొచ్చారు. అమ్మా, నాన్న, చెల్లి, మేనత్త అందరూ కనెక్ట్ అవుతారు. రాజేంద్రప్రసాద్ గారు, పోసాని, పవిత్ర, మురళీశర్మ అందరూ చాలా బాగా చేశారు. మణిశర్మగారు మంచి సంగీతాన్నిచ్చారు. ఆయన పేరు పక్కన నా పేరుంది. అది నాకు చాలా హ్యాపీ. మిగిలిన టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా నటించారు. రాహుల్ బిహేవియర్, రాహుల్ క్యారక్టర్ చాలా బావుంటుంది. కావ్య ఎప్పుడూ స్మైల్‌తో ఉంటుంది. సెట్లో చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. మా నిర్మాత కథను నమ్మి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. విజయ్ మాస్టర్‌గారు నా వెన్నంటి ఉండి నడిపించారు. చిన్నప్పుడు మా నాన్న చేయి పట్టుకుని నడిపించారో లేదో కానీ, మా మాస్టర్‌గారు మాత్రం నా చేయి పట్టుకుని నడిపించారు' అని అన్నారు.
హీరోయిన్ కావ్యా థాపర్ మాట్లాడుతూ... 'వేదిక మీద ఉండటం చాలా నెర్వస్‌గా ఉంది. ఎన్టీఆర్ గారికి స్పెషల్ థాంక్స్. ఈ ప్రొడక్షన్ హౌస్‌కి ధన్యవాదాలు' అని అన్నారు.
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ... 'రామ్ మాస్టర్‌గారు మమ్మల్ని, విజయ్ మాస్టర్‌ని ప్రోత్సహించారు. విజయ్ మాస్టర్, మేమూ ఒకే రూమ్‌లో మా జర్నీని 1985లో మొదలుపెట్టాం. అలా చెన్నైలో మా జీవితాన్ని మొదలుపెట్టి, హైదరాబాద్‌కి 2001లో వచ్చాం. మా కన్నా ముందు విజయ్ మాస్టర్ హైదరాబాద్ కి వచ్చారు. విజయ్ మాస్టర్‌కి శ్రీహరి అన్న చాలా సాయం చేశారు. మాకు పూరి జగన్నాథ్ అన్న ఎంతో సాయం చేశారు. జీవితంలో ఎదగడానికి ఎంతో మంది సాయం చేయాలనేది మా అనుభవంలో మేం తెలుసుకున్న నిజం. రాహుల్ చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. విజయ్ మాస్టర్ రాహుల్‌ని చిన్నప్పటి నుంచి హీరో కావాలనే పెంచారు. మేం మహేశ్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడ కో డైరక్టర్లు రాహుల్ బాగా చేస్తున్నాడని మాట్లాడుకుంటుంటే మేం విన్నాం. చాలా ఆనందంగా అనిపించింది. మా కన్నా ముందు విజయ్ ఫైట్ మాస్టర్ అయ్యాడు. యూనియన్ లో కార్డు తీసుకోవడానికి విజయ్ మాకు రూ.5వేలు ఇచ్చాడు. ఆ తర్వాత బైక్ కొనడానికి రూ.5వేలు ఇచ్చాడు. కారు కొనడానికి రూ.25వేలు ఇచ్చాడు. అలా మా విజయంలో ఆయన ఉన్నాడు. హిందీలో హిట్ అయిన అజయ్ దేవ్‌గణ్ ఓ ఫైట్ మాస్టర్ కొడుకు. మా రాహుల్ కూడా అంత పెద్ద హిట్ కావాలి' అని అన్నారు.
ఆకాష్ పూరి మాట్లాడుతూ... 'నేను, రాహుల్ సినిమా పిచ్చోళ్లం. దేవుడు చేసిన మనుషులు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రాహుల్ ఒకసారి డ్యాన్స్ చేస్తే, చూసి చాలా ఇన్‌స్పయిర్ అయ్యాను. రాహుల్ చాలా పెద్ద హీరో అవుతాడు' అని అన్నారు.
శ్రీమణి మాట్లాడుతూ... 'ఈ చిత్ర దర్శకుడు రాము, నేను రూమ్మేట్స్. తను కథలు చాలా చెప్పేవాడు. అందులో ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. శ్రీశ్రీగారి కొన్ని లైన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని ఇందులో సాకీలాగా ఒక పాటలో పెట్టాం. ట్రైలర్ చాలా బావుంది' అని చెప్పారు.