ఇటీవల జగన్.. పవన్‌కళ్యాణ్‌ని ఉద్దేశించి కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మెగాభిమానులతో పాటు పవన్‌కళ్యాణ్ కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నారు. తాజాగా ఈ చవకబారు వ్యాఖ్యలపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించాడు. ఓ పార్టీ అధినేతగా జగన్ నోరు జారడం మంచిది కాదు. నా తమ్ముడిని ఎదుర్కొనే సత్తా లేకనే ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మిగిలిన వారు మాట్లాడటం వేరు.. వైసీపీ పార్టీ అధ్యక్షునిగా, ప్రతిపక్ష నేతగా జగన్ మాట్లాడటం వేరు. వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది.
రాజకీయాలలోకి వద్దని మేము చెబుతున్నా కాదని చెప్పి పవన్ ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి వచ్చాడు. తప్పు చేస్తే అంగీకరించే దమ్ము పవన్‌కి ఉంది. సినిమాలలో నెంబర్ వన్ స్థానాన్ని వదులుకుని మరీ పవన్ రాజకీయాలలోకి వచ్చిన సంగతి మరువవద్దు. పవన్ ఎవ్వరినీ నమ్మించి మోసం చేయలేదు. ఇద్దరు భార్యల నుంచి విడాకులు తీసుకున్న తర్వాతే మరోసారి వివాహం చేసుకున్నాడు. విడాకులకు కారణం ఏమిటి అనేది భార్యాభర్తలకి సంబంధించిన వ్యక్తిగత విషయం. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు. న్యాయంగా బతుకుతున్న పవన్‌పై ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు.
వివాహాలు చేసుకుని ఎందరో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు. పవన్‌ని విమర్శించడానికి ఏమీ లేకనే ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలు అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి. ఏపీలో పవన్ రాజకీయ శక్తిగా మారుతూ బలపడుతున్నాడు. ఆయనను తక్కువగా అంచనా వేయవద్దని టిడిపి, వైసీపీలను నాగబాబు హెచ్చరించారు. నాగబాబు చెప్పిన మాటలు అక్షరసత్యమనే చెప్పాలి.