'పెళ్లిచూపులు' ద్వారా సాఫ్ట్ క్యారెక్టర్‌తో మెప్పించి, 'మహానటి'లో కూడా ఓకే అనిపించిన విజయ్‌దేవరకొండ 'అర్జున్‌రెడ్డి' చిత్రంలోనే కాదు.. ఆ చిత్రం ఆడియో, ప్రమోషన్లలో కూడా బూతులు మాట్లాడుతూ తన యాటిట్యూడ్‌ని చూపించాడు. ప్రేక్షకులు మరీ ముఖ్యంగా యువతలో ఆయనకు ఈ ఒక్క చిత్రంతోనే స్టార్ ఇమేజ్ వచ్చి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఇక 'అర్జున్‌రెడ్డి' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆయన నటించిన పూర్తి స్థాయి చిత్రం 'గీతగోవిందం' ప్రమోషన్స్‌లో కూడా అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలోని ఆయన క్యారెక్టర్ కూడా డిఫరెంట్, ఇగోయిస్టిక్ క్యారెక్టరైజేషన్‌తోనే ఉంటుందని సమాచారం.
తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఆగష్టు15న భారీగా విడుదల కానున్న ఈ చిత్రం గీతాఆర్ట్స్‌ని అనుబంధంగా, బన్నీవాసు నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో రూపొందింది. తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేసిన పాటను గోపీసుందర్ సంగీత దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ సొంతగా పాడాడు. ఈ పాట సాహిత్యపరంగా తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. సీత, సావిత్రి వంటి మన దేశీయులు దేవతల్లా కొలిచే పతివ్రతల పేర్లతో కాస్త ఇబ్బందికరమైన సాహిత్యంతో ఉండటంతో దీనిపై పలువురు మండిపడుతున్నారు. దాంతో వివాదం ముదరగూడదనే ఉద్దేశ్యంలో ఈ పాటని యూట్యూబ్ నుంచి తొలగించారు. 'ఆరడుగులు బుల్లెట్..' అంటూ అద్బుతమైన పదాలతో 'అత్తారింటికి దారేది'లో పవన్ ఇంట్రడక్షన్ పాటను రాసిన శ్రీమణి ఈ పాటకి సాహిత్యం అందించాడు.
తాజాగా 'గీతగోవిందం'లోని యూట్యూబ్ నుంచి తొలగించిన పాటపై శ్రీమణి స్పందించాడు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం అనేది మా ఉద్దేశ్యం కాదు. అందరి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే అభ్యంతరకరమైన పదాలను మారుస్తున్నాం అని చెప్పాడు. అయినా అర్జున్‌రెడ్డి యాటిట్యూడ్ కోసం ఎంతో పేరున్న గీతాఆర్ట్స్ వంటి వారు ఇలా చవకబారు పాటలను రాయించడం బాధాకరం. అర్జున్‌రెడ్డి విషయంలో వర్మవంటి వారి ప్రోద్బలంతో వి.హన్మంతరావు వంటి పెద్దలను అవమానించిన విజయ్ ఇలా మరీ శృతిమించితే తలనొప్పులు తప్పవు.