ఒక్కో హీరోకి ఒక్కో ఇమేజ్ ఉంటుంది. ఇక నేటి కాలంలో యంగ్ జనరేషన్ హీరోలు కూడా బాగానే రాణిస్తున్నారు. వీరిలో నాగశౌర్య ఒకరు. ఈయన తాజాగా 'ఛలో' చిత్రంతో తన కెరీర్‌లోనే పెద్ద హిట్‌ని నమోదు చేసుకుని, నిర్మాతగా, హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక ఒకనాడు ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే మొగుడి పాత్రలు, ఇల్లాలు, ప్రియురాలు మధ్య ఏదీ తేల్చుకోలేని కథలు మహిళా ప్రేక్షకులను, ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా మెప్పించేవి. ఇలాంటి చిత్రాల ద్వారానే శోభన్‌బాబుకి స్టార్ ఇమేజ్ వచ్చింది. 'ఇల్లాలు-ప్రియురాలు'తో సహా 'ఏవండీ.. ఆవిడ వచ్చింది' వరకు ఆయన పెద్ద వయసులో కూడా అలాంటి పాత్రలతో అలరించాడు.
ఆ తర్వాత వెంకటేష్ 'ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు' జగపతిబాబు 'శుభలగ్నం, మావిచిగురు, ఆయనకి ఇద్దరు' వంటి ఎన్నో చిత్రాలలో నటించిన శోభన్‌బాబు తర్వాత ఆ క్రేజ్‌ని సాధించిన ఫ్యామిలీ హీరోగా నిలిచాడు. ఇక జగపతిబాబుతో పాటు శ్రీకాంత్ వంటి వారు కూడా ఇలాంటి చిత్రాలలో నటించారు. ఇక నాగశౌర్య విషయానికి వస్తే ఆయన మాస్ హీరోగా పెద్దగా సూట్ కాడనే చెప్పాలి. డ్రీమ్‌బోయ్, చాక్లెట్ బోయ్ తరహా పాత్రలు ఆయనకు బాగా సూట్ అవుతాయి. ఇక ఈయన నేటితరంలో శోభన్‌బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి వారి కొరతను గుర్తించి ఆ తరహా ఇమేజ్ కోసం కృషి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈవీవీ దర్శకత్వంలో జగపతిబాబు, రమ్యకృష్ణ, ఊహ నటించిన 'ఆయనకిద్దరు' చిత్రం కథనే కాస్త మార్పులు చేర్పులతో నేటి జనరేషన్‌కి నచ్చేలా ఓ చిత్రం చేసేందుకు నాగశౌర్య అంగీకరించాడు. ఈ చిత్రానికి రాజా దర్శకత్వం వహిస్తుండగా, భవ్యఆర్ట్స్ అధినేత వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం. ప్రస్తుతం నాగశౌర్య తన సొంత ప్రొడక్షన్‌లో 'నర్తనశాల' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ తాజా చిత్రం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హీరోయిన్ల ఎంపికపై కసరత్తు జరుగుతోంది.