రాజకీయాలలో సవాళ్లు, ప్రతి సవాళ్లు మామూలే. అయితే ఎవరి నోటికి వచ్చింది వారు ఆరోపణలు చేయడం.. వాటిపై ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ప్రతిసవాలులు విసరడం మామూలే. కానీ ఇప్పటివరకు ప్రత్యర్ధులు ఎవరిపై వారు విమర్శలు చేయడమే తప్ప బహిరంగ చర్చకు వచ్చి తమ వాదనలను వివరించిన దాఖలాలు లేవు. ఇక విషయానికి వస్తే తాజాగా జనసేన అధినేత పవన్ ఒకేసారి సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, రాష్ట్రమంత్రి నారా లోకేష్, ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు ముగ్గురికి బహిరంగ సవాల్ విసరడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజాగా పవన్ మాట్లాడుతూ.. టీడీపి, వైసీపీల అవినీతి యనమదుర్రు డ్రెయిన్ ఎలా కంపుకొడుతోందో టిడిపి, వైసీపీల అవినీతి కూడా అంత కంపు కొడుతోందని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుపొందిన పశ్చిమగోదావరి జిల్లా నేడు తాగునీటికి అల్లాడుతోంది. చంద్రబాబుకి దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. పంచాయతీ ఎన్నికలు పెడితే అందులో ఓడిపోతామనే భయంతో ఎన్నికలను బాబు పెట్టకుండా తాత్సారం చేస్తున్నారు. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కూడా ఆయన వాయిదా వేయగలరా? భీమవరంకు ఒక్క డంపింగ్ యార్డ్‌ని కూడా ఏర్పాటు చేయలేని టిడిపి గొప్పలు చెప్పుకుంటోంది. నేను పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడుతుంటే జగన్ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి గారూ.. మీరు అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. యనమదుర్రు డ్రెయిన్, తాగునీటి సమస్య, అక్వా రైతుల కష్టాల గురించి అసెంబ్లీలో మాట్లాడమని చెబితే ఆయన నన్ను వ్యక్తిగతంగా తిడుతున్నారు. మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నేను ఎంతో మాట్లాడగలను. నేను ప్రజాసమస్యల గురించి ప్రస్తావిస్తే నా వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని చంద్రబాబు, లోకేష్‌లు విమర్శిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, జగన్ ముగ్గురికి కలిపి నేను చాలెంజ్ విసురుతున్నాను. పశ్చిమగోదావరి జిల్లాపై చర్చ పెట్టండి. నేను వచ్చి మాట్లాడుతాను. ఈ డిస్కషన్ భీమవరంలో జరగాలి. మీ ముగ్గురు ఒకవైపు ఉండండి.. నేనొక్కడినీ మీ ముగ్గురికి సమాధానం చెబుతాను.. అంటూ చాలెంజ్ విసిరాడు. అయినా పవన్ చాలెంజ్ విసిరినంత మాత్రాన చంద్రబాబు, లోకేష్, జగన్‌లు ముగ్గురు ఒకే వేదికపైకి రావడం జరగని పని. మరి పవన్ చాలెంజ్‌పై వీరు మీడియా సమక్షంలోనైనా సమాధానం ఇస్తారేమో వేచిచూడాల్సివుంది..!