కొన్నిసార్లు సినిమాపై మరీ అంచనాలు పెరిగితే దాని వల్ల నష్టం కూడా ఉంటుంది. ప్రేక్షకులు ఏదేదో ఆశించి సినిమాకి వచ్చి వారు అనుకున్న రేంజ్‌లో చిత్రం లేదని మంచి చిత్రాలు కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అక్కినేని కోడలు సమంత అప్పుడే పసిగట్టింది. ఈమె తాజాగా తెలుగు, తమిళ భాషల్లో 'యూటర్న్' చిత్రంతో పాటు శివకార్తికేయన్ దర్శకత్వంలో 'సీమరాజా' అనే చిత్రంలో నటిస్తోంది. 'సీమరాజా' చిత్రం కోసం ఈమె సిలంబం అనే మార్షల్ ఆర్ట్స్‌ని నేర్చుకుంది. ఇందులో ఆమె సిలంబంని నేర్పించే టీచర్ పాత్రను పోషిస్తోంది. దాంతో ఈ సినిమాపై సమంత అభిమానుల అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల ఈ చిత్రంలోని ఓ ఫొటో బయటకు వచ్చింది. చక్కగా లంగావోణిలో పావురాన్ని చూస్తున్నట్లుగా ఉన్న సమంత స్టిల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అయితే ఈ పోస్టర్‌ని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, 'సీమరాజా' చిత్రంలో సమంత సుతంత్రా దేవి అనే పాత్రలో సిలంబం టీచర్ పాత్రను పోషిస్తున్నారు. ఇందుకోసం ఆమె మూడునెలలు 'సిలంబం'లో శిక్షణ తీసుకున్నారు... అని ట్వీట్ చేశాడు. దీనికి సమంత సమాధానం ఇస్తూ 'ఓ మైగాడ్ ..నేను సిలంబం నేర్చుకోవడానికి కేవలం 15రోజులే శిక్షణ తరగతులకు వెళ్లాను. అంతేగానీ మూడు నెలలు కాదు నా నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించవద్దు' అని తెలిపింది. ఇందుకు మరలా ఆ నెటిజన్ సమాధానం ఇస్తూ, మీరు మూడు నెలలు శిక్షణ తీసుకున్నట్లు దర్శకుడు పొన్రాం తెలిపారు. అందుకే మీ పాత్ర నుంచి కాస్త ఎక్కువే ఆశిస్తున్నాను.. అని తెలిపాడు. దీనికి సమంత స్పందిస్తూ 'వద్దు' అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది.