నిన్నమొన్నటితరంలో ఆత్మాభిమానంతో తనపై చిన్న మచ్చ కూడా లేకుండా నాటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారిని కూడా ఎదిరించి నిలబడిన నటిగా జమునకు ఎంతో పేరుంది. ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఆమెకి అదే తత్వం ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టినా ఆమె తన ప్రవర్తనకు కట్టుబడి ఉండేది. స్టార్ హీరోలు ఆమెకి పొగరని చెప్పి ఆమెతో నటించడానికి నిరాకరించిన సమయంలో కూడా రెండో తరగతికి చెందిన నాటి జగ్గయ్య, హరనాథ్, కృష్ణంరాజు వంటి వారితో నటిస్తూ తన సత్తా చాటింది.
ఈమె తాజాగా మాట్లాడుతూ, నేను ఎంతో కాలంగా సినీ పరిశ్రమలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉన్నాను. మా తరంలో సావిత్రి, భానుమతి, నేను.. ఇలా అందరం ఎదుగుతున్న కొద్ది ఒదుగుతూ వచ్చాం. అలా నడుచుకోవడం వల్లనే మేము పాతిక ముప్పై సంవత్సరాలు హీరోయిన్లుగా వెలుగొందాం. పెద్దలను గౌరవించడం మా తరానికి బాగా తెలుసు. దర్శకులు చెప్పింది చేయటమే కాదు.. మాకేదైనా ఆలోచన వస్తే ఇలా కూడా నటిస్తే ఎలా ఉంటుందండీ? అని దర్శకులను అడిగేవాళ్లం. అలా పెద్ద దర్శకులను కూడా ఒప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దర్శకనిర్మాతలు, హీరో హీరోయిన్ల మద్య మంచి స్నేహపూరిత వాతావరణం ఉండేది.
ఇప్పుడు సీనియర్స్‌ని గౌరవించే పరిస్థితులు లేవు. ఈ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో ఓ హీరో పక్కన కూర్చున్నాను. ఆ హీరో తన బూటుకాలు నాకు తగిలేలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. సభా మర్యాద.. పెద్దలను ఎలా గౌరవించాలి? అనేది ఈ తరంలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అని చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన అభిప్రాయాలనే గతంలో సీనియర్లు అయిన కైకాల సత్యనారాయణ, కాంతారావు వంటి వారు కూడా వెలిబుచ్చారు.