గజరాజు వీధిలో విహరిస్తున్నప్పుడు కుక్కలు నానా అరుపులు అరుస్తాయి. అలాగని కుక్కలలాగా ఏనుగు కూడా స్పందిస్తే రెంటికి తేడా ఉండదు. ఎవరో మూర్ఖుడు వ్యక్తిగతంగా ఏవో అన్నంత మాత్రాన దానికి రెండాకులు తిట్టగల అవకాశం ఉన్నా బజారున పడకుండా పెద్దరికంతో మౌనంగా ఉండటం విజ్ఞులు చేసే పని. ఈ విషయంలో జనసేనాని పవన్, జగన్ విషయంలో అలానే వ్యవహరిస్తున్నాడు.
తాజాగా జగన్ విమర్శలపై పవన్ స్పందిస్తూ, సామాజిక, రాజకీయ వ్యవస్థలను మార్చకపోతే గూండాలు, ఫ్యాక్షనిస్ట్‌లు రాజ్యమేలుతారు. స్వార్థం లేని వారే రాజకీయాలలో ఉండాలి. రాజకీయాలు చేయాలంటే పెట్టి పుట్టనక్కరలేదు. ధైర్యం, తెగింపు ఉంటే చాలు. అర్ధరాత్రి ఆడవారు నడిరోడ్డుపై నిర్భయంగా తిరిగినప్పుడే స్వాతంత్య్రం వచ్చినట్లని గాంధీ చెప్పారు. కానీ నేడు ఆడపిల్లలు పగలు కూడా ధైర్యంగా, ఒంటరిగా రోడ్లపై తిరగలేకపోతున్నారు. 2019 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలకం. అందరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. తుపాకులతో కాల్చినవారు, దోపిడీలు చేసి చట్టం నుంచి తప్పించుకున్నవారు ప్రజలను శాసిస్తున్నారు. వారిపై పెత్తనం చెలాయిస్తున్నారు. దోపిడీ దారులు కోట్లు సంపాదిస్తూ ఉంటే.. పీజీ, పిహెచ్‌డి చేసిన వారు వారి కింద పనిచేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ మారాలి.
నేను మంత్రి లోకేష్‌లా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాలలోకి రాలేదు. ఒక మాట మాట్లాడితే తెలంగాణ వారికి కోపం.. మరో మాట మాట్లాడితే ఏపీ ప్రజలు తిట్టే పరిస్థితుల్లో నేను రాజకీయాలలోకి వచ్చాను. మంత్రి లోకేష్ ఏ పని చేస్తే ఎంత వస్తుంది అనే తరహాలో పనిచేస్తున్నారు. ప్రతిపక్షనేత జగన్‌లా నేను కూడా తిట్టగలను. నాకు కూడా పెద్ద నోరు ఉంది. కానీ ఒకరిని ఒకరు తిట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావు. రాజకీయ నాయకులు చేసే పాలసీల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. అందుకే మరో 25ఏళ్లు రాజకీయాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నానని హుందాగా మాట్లాడాడు.