పరభాషా నటుడైనప్పటికీ నవరసాలను పోషించగలిగి, తాను కాకుండా తెరపై కేవలం తన పాత్రనే కనిపించేలా నటించగలిగిన విలక్షణ నటునిగా ప్రకాష్‌రాజ్ పేరు తెచ్చుకున్నాడు. ఆయనలోని ప్రతిభను చూసి కె.బాలచందర్ వంటి దర్శకుడే ముగ్దుడయ్యాడంటే అర్ధమవుతుంది. ఇక ఈయన కెరీర్‌లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇద్దరు'లో కరుణానిధి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఈయనపై ఒక్కోక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది. క్రమశిక్షణ లేని వ్యక్తి అని, షూటింగ్‌లకు సరిగా రాడని, నోరు పారేసుకుంటాడని.. ఇలా ఎన్నో అభియోగాలు ఆయన మీద ఉన్నాయి. అందుకే ఒకటి రెండు సార్లు బహిష్కరణ వేటుని కూడా అనుభవించాడు.
ఇక ఈయనంటే ఇష్టపడే వారిలో కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, నిర్మాత దిల్‌రాజు వంటి వారిని ప్రత్యేకంగా చెప్పాలి. మరీ ముఖ్యంగా దిల్‌రాజు నిర్మించే చిత్రాలన్నింటిలో ఈయన విభిన్నమైన పాత్రలు చేస్తూ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ప్రతిభపై దిల్‌రాజుకి అంత నమ్మకం. కాగా ఇటీవలే సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన 'శతమానంభవతి'లో అదరగొట్టిన ప్రకాష్‌రాజు ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాతగా అదే సతీష్ దర్శకత్వంలో నితిన్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న 'శ్రీనివాసకళ్యాణం'లో కీలకమైన పాత్రను చేస్తున్నాడు.
ఇక ఈయన తనకున్న డిమాండ్ దృష్ట్యా ఒకరోజుకి 5 నుంచి 6లక్షల పారితోషికం తీసుకుంటాడు. కానీ ఈయన 'శ్రీనివాసకళ్యాణం' చిత్రానికి మాత్రం కేవలం రోజుకి మూడు లక్షలు మాత్రమే తీసుకుని నటిస్తున్నాడట. ఇది ఆయనకు అవకాశాలు లేక, ఫేడవుట్ అయి తగ్గించుకున్న పారితోషికం కాదు. దిల్‌రాజుతో ఉన్న అనుబంధం రీత్యానే డబ్బుల విషయంతోపాటు అన్నింటిలో కఠినంగా ఉండే ప్రకాష్‌రాజ్ సైతం దిల్‌రాజుకి ఈ స్పెషల్ డిస్కౌంట్ బోనాంజాని అందించాడని తెలుస్తోంది.