కొంతకాలం కిందట దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో శర్వానంద్ హీరోగా 'మహానుభావుడు' చిత్రం వచ్చి విజయం సాధించింది. ఈ మూవీ ఓసీడీ ( అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్) అనే మానసిక రోగం చుట్టు అల్లుకున్న కథ. కానీ ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగా ఈ చిత్రం స్టోరీ ఇదేనంటూ మరో వార్త హల్‌చల్ చేసింది. ఇందులో శర్వానంద్ కోటీశ్వరుడిగా నటిస్తున్నాడని, ఆయనకు ఈ స్టోరీలో బ్రాండెడ్ వస్తువంటే పిచ్చి అనే పాయింట్ ఆధారంగా రూపొందుతోందని వార్తలు వచ్చాయి. కానీ 'మహానుభావుడు' విడుదల తర్వాత ఆ కథ ఇది కాదని తేలింది. అయితే మారుతి తయారు చేసుకున్న ఈ స్టోరీ మాత్రం ఇప్పటికీ ఆయన వద్దే ఉంది.
ఇదే కథను మారుతి అందిస్తుండగా, కొత్త తరహా ప్రేమకథగా దీనిని రూపొందించేందుకు దర్శకుడు ప్రభాకర్ చేస్తున్న ప్రయత్నమే 'బ్రాండ్ బాబు'. మారుతి కథను అందించిన ఈ చిత్రంలో సుమంత్ శైలేంద్ర, ఈషారెబ్బా జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని మారుతితో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తున్న అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ఓ అపర శ్రీమంతుడి కుమారుడు, ఓ పనిమనిషి పిల్లతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర ప్రేమకథా చిత్రంగా ఇది రూపొందుతోందని అర్ధమవుతోంది.
ఈ హీరో ప్రతి విషయంలోనూ బ్రాండ్‌కి ప్రాధాన్యం ఇస్తూ చివరకు పనిమనిషి ప్రేమలో పడతాడు. ఇక ఈ చిత్రంలో హీరో తండ్రిగా మారుతి దర్శకత్వంలో వచ్చిన 'భలే భలే మగాడివోయ్'లో అద్భుతమైన పాత్ర పోషించిన మురళీశర్మనే ఈ బ్రాండ్‌బాబులో హీరోకి తండ్రి పాత్రను పోషిస్తున్నాడు. లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌తో ఈ ట్రైలర్ నిండి ఉంది. ఈ చిత్రం ఆగష్టు 3వ తేదీన విడుదల కానుంది. గతంలో కూడా ఇతరులకు మారుతి కథను అందించిన చిత్రాలు బాగా ఆదరణ పొందడంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయని చెప్పాలి.