చిరంజీవి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ కావడంలో ఎందరి సహకారమో ఉంది. కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు, రవిరాజా పినిశెట్టి వంటి దర్శకులతో పాటు యండమూరి, సత్యానంద్, జంధ్యాల వంటి రైటర్స్ కూడా తమ వంతు కృషి చేశాడు. ఇక విజయ బాపినీడు నుంచి కెఎస్‌రామారావు, అశ్వనీదత్ వరకు ఎందరో ఈ లిస్ట్‌లో కనిపిస్తారు. ఇక విషయానికి వస్తే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి సీనియర్ రచయితలైన పరుచూరి బ్రదర్స్ సిద్దహస్తులు. ఏ సీన్‌కి ఏడైలాగ్ రాస్తే పేలుతుందో వారికి కొట్టినపిండి. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు, బాలకృష్ణ , చిరంజీవి వంటి ఎందరికో వారు తమ డైలాగ్స్ ద్వారా సీన్లను పండించడంలో సక్సెస్ అయ్యారు. అందుకే చిరంజీవి ఇప్పుడు వారు పెద్దగా సినిమాలు ఒప్పుకోకపోయినా కూడా వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు.
తాజాగా చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం 'సై..రా..నరసింహారెడ్డి'లో కూడా వీరి పాత్ర ఎంతో ఉంది. ఇక వీరికి బి.గోపాల్, వినాయక్ వంటి పవర్‌ఫుల్ దర్శకులు దొరికితే థియేటర్లు వారి సంభాషణలకే మారుమోగిపోతాయి.
ఇక తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, వినాయక్‌తో 'ఆది, చెన్నకేశవరెడ్డి' వంటి చిత్రాలతో పాటు వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి అవినీతిపై పాశుపతాస్త్రంగా, ఆయన రాజకీయ అరంగేట్రానికి కూడా ఉపయోగపడిన 'ఠాగూర్' చిత్రానికి కూడా మేమే సంభాషణలు అందించాం. వినాయక్ దర్శకత్వంలో మేము పనిచేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ఠాగూర్'. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయింది. షాయాజీషిండేను కొట్టే సమయంలో ఓ పవర్‌ఫుల్ డైలాగ్ ఉంటే బాగుంటుందని చిరంజీవి గారు అనుకుంటున్నారు... అంటూ వినాయక్ నాకు సీన్ పేపర్ ఇచ్చారు. అప్పుడు నేను ఒక డైలాగ్ రాశాను. అది చూసిన వినాయక్ నవ్వుతూ మిమ్మల్ని చిరంజీవి గారు ఇంతలా ఎందుకు నమ్ముతారో ఈ డైలాగ్ ద్వారా అర్ధమైంది అన్నాడు.
అలాగే నీ కంఠంలోని నరాలు తెంచి నా బూట్‌కి లేసులుగా కట్టుకుంటాను అనే డైలాగ్ చూసి చిరంజీవి గారు ఎంతో ఆనందపడి ఫోన్ చేసి అభినందించారు. వాస్తవానికి 'రమణ' రీమేక్‌గా వచ్చిన 'ఠాగూర్'ని కూడా మురుగదాసే దర్శకత్వం వహించాల్సివుంది. కానీ మేము చెబుతున్న మార్పులకు ఆయన ఒప్పుకోవడం లేదు. అప్పుడు మా అన్నయ్య 'ఇలాగైతే కష్టం' అన్నారు. దాన్నివిన్న చిరంజీవి గారు వినాయక్‌ని రంగంలోకి దింపాడని చెప్పుకొచ్చాడు.