నటి భావన కిడ్నాప్, అత్యాచారయత్నం కేసులో మలయాళ నటుడు దిలీప్ కటకటాల వెనక్కి వెళ్లి ఎన్నోసార్లు బెయిల్ తిరస్కరణకు గురై జైలు జీవితం అనుభవించాడు. ఇక ఇటీవల ఆయనకు బెయిల్ రావడంతో బయటకు వచ్చాడు. అయితే ఆయన అలా బయటికి రాగానే మలయాళ నటీనటుల సంఘం 'అమ్మా' అధ్యక్షుడైన మోహన్‌లాల్ ఆఘ మేఘాల మీద దిలీప్‌ని మరలా అమ్మాలోకి తీసుకున్నాడు. ఈ పరిణామంతో పలువురు మలయాళ నటీమణులు మోహన్‌లాల్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమ్మా నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు సినీ సెలబ్రిటీలు, మలయాళ నటీనటులు, ఇతర ప్రముఖులు, పలు రాజకీయ పార్టీలు, సామాన్యులు మోహన్‌లాల్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ గళం విప్పుతున్నారు. దిలీప్ సభ్యత్వాన్ని మరలా పునరుద్దరింపజేయడంపై మోహన్‌లాల్‌కి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
దాంతో త్వరలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల కార్యక్రమానికి మోహన్‌లాల్‌ని ఆహ్వానించవద్దంటూ జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు బిజుకుమార్ దామోదరన్ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాడు. దాని మీద ఆయన ఓ లేఖ రాశాడు. ఈ లేఖకు వందకు పైగా నటీనటులు మద్దతు తెలుపుతున్నట్లు బిజుకుమార్ తెలిపాడు. వారిలో ప్రకాష్‌రాజ్, మాధవన్, గీతా మోహన్‌దాస్, శృతిహరిహరన్ ఉన్నట్లుగా కూడా బిజూ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ బిజుమోహన్ వ్యాఖ్యలను కొట్టి పారేశాడు. తాను మోహన్‌లాల్‌కి వ్యతిరేకంగా బిజూ రాసిన లేఖలో సంతకం చేయలేదని ఆయన కుండ బద్దలు కొట్టాడు. అమ్మ తీసుకున్న నిర్ణయంలో నాకు కొన్ని విబేధాలున్నాయి. కానీ నేను మోహన్‌లాల్‌కి వ్యతిరేకంగా రాసిన లేఖలో సంతకం చేయలేదని చెప్పుకొచ్చాడు.
ప్రకాష్‌రాజ్ మాత్రమే కాదు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ తుండియల్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. బిజూ రాసిన లేఖలో తాను సంతకం చేయలేదని తెలిపాడు. మోహన్‌లాల్‌ని ఏ వేడుకకు ఆహ్వానించకూడదనే నిర్ణయం ఎవరికైనా వచ్చిందంటే వారంత మూర్ఖులు లేరనే చెప్పాలి. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. కేరళ ప్రభుత్వ అవార్డుల ప్రధానోత్సవం జరగబోతున్నట్లు నాకు వాట్సాఫ్ మెసేజ్ వచ్చింది. ఇందుకు నేను వస్తానని సమాధానం ఇచ్చాను. కానీ అందులో మోహన్‌లాల్ గురించిన ప్రస్తావన అసలు లేదు. ఒకవేళ మోహన్‌లాల్‌ని ఆహ్వానించడం లేదని నాకు తెలిపి ఉంటే ఆ కార్యక్రమానికి నేను కూడా రానని చెప్పేవాడినని సంతోష్ తుండియల్ కుండబద్దలు కొట్టాడు. మొత్తానికి ప్రస్తుతం మలయాళ పరిశ్రమ మోహన్‌లాల్ అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయిందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని చెప్పవచ్చు.