సినిమా అనేది కల్పితం. నిజజీవితంలో మనం చేయాలని ఉండి, చేయలేని హీరోయిజాన్ని, ఊహలను తెరపైకి తెచ్చి ప్రేక్షకులను తామే హీరోలమనే భావన కల్పించే శక్తివంతమైన మాద్యమం. ఇక జర్నలిజం కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది. ఎవరో ఏదో అంటే.. లేదా ఏదైనా ఫొటోని చూసి ఊహాజనితంగా పుకార్లు వండి వార్చడం మామూలైపోయింది. అయితే ఈ విషయంలో సినిమా వారు, మీడియానే కాదు నెటిజన్లు, అభిమానులు కూడా తామేమీ సామాన్యులం కాదని నిరూపిస్తున్నారు. టైటిల్ పెట్టకముందే టైటిల్‌ని ప్రచారం చేసి ఫ్యాన్స్ మేడ్ పోస్టర్లని, వార్తలను, సినిమా విశేషాలను, టీజర్లను కూడా క్రియేట్ చేస్తున్నారు.
ఇక ఇలాంటి ఓ వార్త బాలీవుడ్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ జంట ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్‌లకు స్పర్దలు వచ్చాయని ఓ వెబ్‌సైట్ రాసింది. దీనికి ఆధారం ఏమిటో తెలిస్తే విస్తుపోక తప్పదు. బచ్చన్ కుటుంబం ఇటీవల లండన్ వెళ్లింది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. వాటిని మీడియా ఫొటోలు, వీడియోలు తీసింది. ఆ ఫొటోలలో బచ్చన్ కుమార్తె ఆరాధ్య తన తండ్రికి దూరంగా తన తల్లి ఐశ్వర్యాని గట్టిగా పట్టుకుని ఉంది. ఆమె కూడా పాపని గట్టిగా పట్టుకుంది. దాంతో ఆరాధ్యని ఐశ్వర్య అభిషేక్‌కి దూరంగా ఉంచుతోందని, ఆయన వద్దకు పంపడం లేదని, భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని కథనం అల్లింది. దీనిపై అభిషేక్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
సున్నిత విషయాలపై తప్పుడు కథనాలు రాయడం సబబుకాదు. బాధ్యతగా వ్యవహరించాలి. తప్పుడు కథనాలు రాయకండి. వెబ్‌సైట్ వారి అవసరాన్ని నేను అర్ధం చేసుకోగలను. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే అభినందించే వాడిని అని సున్నితంగా చెప్పాడు. ఇక ఇటీవల ఓ నెటిజన్ ఆరాధ్య ఎక్కువగా పార్టీలలోనే కనిపిస్తోంది. స్కూల్‌కి వెళ్తున్నట్లు లేదు. ఐశ్వర్యనే ఆమెని చెడగొడుతోందని వ్యాఖ్యానించింది. దానికి అభిషేక్ వీకెండ్‌లలో కూడా స్కూల్ ఉంటే పంపేవారిమని స్పందించాడు.