తమిళ స్టార్ హీరో, రజనీకాంత్ తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న స్టార్‌గా అజిత్‌కి ఎంతో పేరుంది. ఈయనతో పోటీ పడటానికి ఎప్పుడు విజయ్ ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. ఇక 'వివేగం, వీరం' వంటి ఎన్నో యావరేజ్ చిత్రాలు కూడా ఆయనకున్న క్రేజ్‌తోనే 100కోట్లను సునాయాసంగా సాధిస్తున్నాయి. ఇక ఈయన హీరోగా తెరంగేట్రం చేసింది మాత్రం తెలుగు చిత్రం ద్వారానే. గొల్లపూడి మారుతిరావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ మొదటి చిత్రం 'ప్రేమపుస్తకం' ద్వారా ఆయన హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఆ చిత్రం షూటింగ్‌లోనే గొల్లపూడి శ్రీనివాస్ వైజాగ్‌లో సముద్రంలో కొట్టుకుపోయి మరణించాడు. ఆమూవీ ద్వారా ఈయన శ్రీకర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అజిత్‌గా మారి ఆయన తమిళంలో వచ్చిన 'వాలి' వంటి ఎన్నో చిత్రాల ద్వారా రజనీకి పోటీని ఇచ్చే స్థాయికి ఎదిగాడు.
మరోవైపు ఈయనకు స్వర్గీయ జయలలిత వద్ద ఎంతో పేరుండేది. ఆమె దత్త పుత్రునిగా పేరు తెచ్చుకున్నాడు. నేడైనా ఆయన రాజకీయాలలోకి వస్తే జయ స్ధానంలో మంచి పోటీని ఇచ్చేవాడు. కానీ ఆయన వివాదరహితుడు. తన అభిమానులు సోషల్ మీడియాలో ఇతర హీరోలతో చేసే వార్‌ని నిత్యం ఖండిస్తూనే ఉంటాడు. ఇక తనకి కటౌట్లు, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు, బ్యానర్లు కట్టేందుకు కూడా ఒప్పుకోడు. ఇక విషయానికి వస్తే తెలుగులో రాజమౌళి చిత్రాల ద్వారా, మరీ ముఖ్యంగా 'ఛత్రపతి' ద్వారా మంచి నటునిగా పేరు తెచ్చుకున్న నటుడు 'ఛత్రపతి' శేఖర్. ప్రస్తుతం ఆయన అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వాసం' చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నాడు.
ఈ సందర్భంగా శేఖర్.. అజిత్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు గొడుగు పట్టే బోయ్ కూడా ఉండడు. వేరే వారి చేత ఆయన గొడుగు పట్టించుకోవడాన్ని ఇష్టపడడు. ఎంత ఎండలో అయినా ఎన్ని టేకులైనా అలాగే చేస్తాడు. ఇటీవల మంచి ఎండల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. షూటింగ్ మొదటి రోజున దర్శకుడు నాకు అజిత్‌ని పరిచయం చేశాడు. 'బాగున్నారా' అని ఆత్మీయంగా పలకరించారు. సెట్‌లోకి వస్తూనే అందరిని పేరు పేరునా పలకరిస్తారు. డైరెక్టర్ రిలాక్స్ అవ్వండి అని చెప్పేదాకా ఎండలో అలాగే నించోని ఉంటాడు. అలా ఆయన్ని చూసి షాక్ అయ్యాను. రెండు సార్లు ఆయనే స్వయంగా బిర్యాని చేసి అందరికి వడ్డించారు అని చెప్పుకొచ్చాడు. అజిత్‌లో ఉన్న మరోగుణం ఏమిటంటే.. ఏదైనా చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే దర్శకనిర్మాతల నుంచి బోయ్ వరకు అందరినీ పిలిచి భోజనం పెట్టి, ప్రతి ఒక్కరికి గిఫ్ట్‌లు అందజేస్తాడు.