వచ్చే దసరా బరిలో ఎన్టీఆర్ ఉంటున్నాడని అన్నారు. కానీ విడుదల డేట్ పక్కాగా లేదు. ఇక దసరా నాటికీ ఎన్ని సినిమాలు విడుదలవుతాయి అనేది మరో నెల రోజుల్లోనే డిసైడ్ అవుతుంది. ఇక దసరా తర్వాత తెలుగు ప్రజలకు అత్యంత కీలకమైన పండగ.. అతి పెద్ద పండగ సంక్రాతి. అందుకే సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసి క్యాష్ చేసుకుంటారు నిర్మాతలు. ఇక సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు ఇప్పటీకే రామ్ చరణ్ - బోయపాటి ల యాక్షన్ చిత్రం ఖరారైంది. జనవరి 11 న రామ్ చరణ్ మొదటగా సంక్రాంతికి కర్చీఫ్ వేసాడు. ఇక దర్శకుడు క్రిష్ - బాలయ్య బాబు ల ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతికే అంటున్నారు. మరి బాలకృష్ణకి సంక్రాంతి కలిసొచ్చిన పండగ. అందుకే తగ్గడు. ఇక సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న మరో నిర్మాత దిల్ రాజు కూడా తన ఎఫ్2 సినిమాని ఈ సంక్రాంతికే విడుదల చేస్తానని చెబుతున్నాడు.
ఇక ఈ ఐదు నెలల్లో మరిన్ని సినిమాలు ఈ సంక్రాంతికి రెడీ కావడం ఖాయంగా తెలుస్తుంది. తాజాగా మరో మూవీ కూడా ఈ సంక్రాంతిని టార్గెట్ చేసేలా కనబడుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా తెరెక్కుతున్న వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమా కూడా సంక్రాంతికి దిగబోతున్నట్లుగా ప్రచారం మొదలైంది. ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ నటుడు మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న ఈ వైఎస్సార్ బయోపిక్ మీద మంచి క్రేజ్ ఉంది. 2019 ఎన్నికల టార్గెట్ గానే ఈ సినిమాని తీస్తున్నారని అందరూ ఫిక్స్ అవుతున్నారు. మరి ఎన్టీఆర్ బయోపిక్ ని బాలయ్య కూడా ఎన్నికల టార్గెట్ గానే తెరకెక్కిస్తున్నాడనే టాక్ ఉంది.
మరి మొన్నామధ్యన టీజర్ తో ప్రభంజనం సృష్టించిన మహానేత వైఎస్సార్ బయోపిక్ యాత్ర సంక్రాంతికే విడుదలవుతుంది అంటే సినిమా మీద భారీ అంచనాలు వచ్చేస్తాయి. ఎందుకంటే మహానటుడు, రాజకీయ నాయకుడు అయిన ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర విడుదలవుతుంది అంటే రెండు సినిమాలకు భారీ క్రేజ్ వచ్చేసినట్లే. ఎందుకంటే ఇద్దరు మహామహులు కాబట్టి. ఎన్టీఆర్ పేద ప్రజల గుండెల్లో గుడి కట్టించుకుంటే... రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా జన హృదయాలను గెలుచుకున్నాడు. మరి మెల్లిమెల్లిగా ఈ సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారే సూచనలైతే కనబడుతున్నాయి. ఇక యాత్ర సినిమాలో మమ్ముట్టితో పాటుగా జగపతి బాబు, సుహాసిని, అనసూయ వంటి స్టార్స్ నటిస్తున్నారు.