నిజానికి డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కాగా లేనిది హీరో కుమారుడు హీరో అయితే తప్పేమిటని వాదించేవారు ఉంటారు. ఇక ఎంత వారసులైనా కష్టపడితేనే పైకి వస్తారని, వారసత్వం అనేది ఎంట్రీ వరకు మాత్రమే ఉపయోగపడుతుందనే వాదన ఉంది. ఇక స్టార్స్‌కి తమ పిల్లలని హీరోలను చేసే ఉద్దేశ్యం ఉందో లేదో గానీ తమ అభిమాన హీరోకి కుమారుడు ఉన్నాడు అంటే భవిష్యత్తులో ఆ పిల్లాడే స్టార్ అవుతాడని అభిమానులు నిర్ణయించేస్తున్నారు. పవన్ కుమారుడు అకిరానందన్, మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ ఇదే కోవలోకి చేరుతారు. మరోవైపు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఇదే ఏడాది అరంగేట్రం దాదాపు ఖాయమైంది.
విషయానికి వస్తే తాజాగా ఎన్టీఆర్ పెద్దకుమారుడు అభయ్‌రామ్ బర్త్‌డే జరిగింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అభిమానులు సందడి చేస్తూ, స్వీట్స్, పండ్లు పంచిపెట్టారు. తమ హీరో కుమారుడు కాబోయే స్టార్ అని బేనర్లు, నినాదాలు చేశారు. ఇక అభయ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి మెగా కోడలు ఉపాసన అభయ్‌రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. చిరంజీవి, రామ్‌చరణ్ సోషల్‌మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు కాబట్టి అన్ని ఉపాసనే చూసుకుంది. ఇటీవల ఆమె మహేష్‌బాబు కూతురికి కూడా బర్త్‌డే విషెష్ తెలిపిన విషయం తెలిసిందే. నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏట అడుగుపెట్టిన అభయ్‌రామ్‌కి పలువురు సినీ ప్రముఖులు కూడా విషెష్ తెలిపారు.
ఈ సందర్బంగా ఎన్టీఆర్ 'థాంక్యూ చరణ్.. ఉపాసన.. మీరిచ్చిన గిఫ్ట్‌తో అభయ్ ఎంతో ఆనందించాడు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. కాగా త్వరలో ఎన్టీఆర్, రామచరణ్‌లు రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ చేయనున్న సందర్భంగా యంగ్‌స్టార్స్ మధ్య వారి కుటుంబాల మధ్య ఇంతటి సాన్నిహిత్యం ఉండటం ఎంతో సంతోషించదగిన విషయం. మరి ఈ విషయంలో వారి అభిమానులు కూడా అదే బాటలో నడుస్తారని భావిద్దాం.