మానవుని దైనందిన జీవితంలో న్యూస్ పేపర్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పొద్దున్నే లేవగానే అందరూ పేపర్ బాయ్ వేసే ఆ న్యూస్ పేపర్ కోసం ఎదురు చూస్తారు. పేపర్ బాయ్ పేపర్ వెయ్యగానే... అలా ఒక కాఫీ సిప్ చేస్తూనో... లేదంటే మరో పని ఏదైనా చేస్తూనో పేపర్ చదువుతూ ఉండేవాళ్ళు కోకొల్లలు. ఫోన్, టివి లాంటి ప్రసార సాధనాలు ఎంతగా వాడుకలోకి వచ్చినా.. ఇప్పటికి న్యూస్ పేపర్ కున్న వాల్యూ ఇసుమంతైనా తగ్గలేదు. ప్రపంచంలోని వార్తలన్నీ ఆ పేపర్ లోనే నిక్షిప్తమై ఉంటాయి. మరి ఆ పేపర్ కి ఎంత ఇంపార్టెన్స్ వుందో అందరికి తెలుసు కానీ, ఆ పేపర్ తెచ్చే పేపర్ బాయ్ గురించి మాత్రం పెద్దగా ఎవరికి తెలియదు. ఇప్పుడా పేపర్ బాయ్ కి ఒక లైఫ్ ఉంటుందని, అతను ప్రేమించగలడని తెలిపే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు సంపత్ నంది.
'గౌతమ్ నందా' సినిమా తర్వాత మరో సినిమా కథా చర్చల్లో వున్న ఆయన.. ఈ లోపు తన సొంత బ్యానర్ సంపత్ నంది టీం వర్క్స్ లో.. ఒక సినిమాని నిర్మిస్తున్నాడు. స్టోరీ స్క్రీన్ ప్లే తో పాటుగా నిర్మాతగా 'పేపర్ బాయ్' అనే సినిమాని కొత్త నటీనటులతో దర్శకుడు జయశంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు. తాజాగా విడుదలైన పేపర్ బాయ్ టీజర్ లో ఒక గొప్పింటి అమ్మాయిని (రియా సుమన్) ఉద్దేశించి హీరో సంతోష్ శోభన్... ఐదున్నర అడుగుల సాంప్రదాయం తాను.... యాభై కిలోల తెలుగుతనం తాను... అందుకే ఐదేళ్లుగా ఆ ఇంటికి ప్రతిరోజూ వెళ్లి గుడ్ మార్కింగ్ చెప్పి వస్తున్నాను అంటూ.. సైకిల్ మీద పేపర్ బాయ్ లా వచ్చి న్యూస్ పేపర్ వేస్తుంటాడు. ఇక హీరోయిన్ ఆ పేపర్లు మధ్యన కూర్చుని ప్రేమను ఫీల్ అవుతూ.. వర్షంలో తడుస్తూ ఫ్రెష్ లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే హీరో కూడా గెడ్డం పెంచి కాస్త రఫ్ లుక్ లో ఉన్నప్పటికీ... బి.టెక్ చదివిన కుర్రాడిగా క్లాస్ లుక్ లోను అదరగొట్టాడు. ఇక హీరోయిన్ రియా సుమన్ ఒక సందర్భంలో బిటెక్ చదివి న్యూస్ పేపర్ వేస్తున్నావేమిటి అని అడిగితె... దానికి శోభన్ అది బతకడం కోసం... ఇది భవిష్యత్తు కోసం అని చెప్పే డైలాగ్ బావుంది.
ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ ఇద్దరూ మంచి నటన కనబరిచారు. ఇక ఫస్ట్ లుక్ తోనే సినిమాలో విషయం ఏదో ఉంది అనిపించినా... ఇప్పుడు టీజర్ తో ఆ ఏదో ఆసక్తిని మరికాస్త పెంచేశారు. ఇక ఈ సినిమా మ్యూజిక్ కూడా డీసెంట్ గా క్లాసీగా ఉంది. టీజర్ చూస్తుంటే ఫ్రెష్ లవ్ స్టోరీతో దర్శకుడు జయ శంకర్ అండ్ నిర్మాత సంపత్ నంది.. డీసెంట్ హిట్ అందుకుంటారనిపిస్తోంది.