పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మంచి సందేశాన్ని అందిస్తూ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం రాజకీయ మేధావులను సైతం మెప్పించింది. ఇందులో ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? రాజకీయాలు ఎలా సాగాలి? అనే పలు విషయాలను అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి ఒకే మేనిఫెస్టో ఉండటం అసంబద్దమని, ఒక్కో ప్రాంతంలో కొన్ని కొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయని, కాబట్టి లోకల్ గవర్నెన్స్ ని పటిష్టం చేయాలంటే ప్రాంతాల వారీగా స్థానిక సమస్యలకు అనుగుణంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మేనిఫెస్టో ఉండాలని ఇందులో కొరటాల సూచించాడు.
మరి దీనిని ఏ రాజకీయ పార్టీలు అనుసరిస్తాయో చెప్పలేం గానీ తాజాగా వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామని, సరికొత్త రాజకీయాలకు బీజం వేస్తామని చెబుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాత్రం దీనిని ఆచరణలో పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఊరూరికి ఎవరి సమస్యలు వారికుంటాయి. అలాంటిది రాష్ట్రం మొత్తానికి ఒకే మేనిఫెస్టో అంటే ఎలా? జనసేనతో మార్పు మొదలైంది. మొట్టమొదటి సారి ఎవరి మేనిఫెస్టో వారికే. 175 నియోకవర్గాలు, 175 మేనిఫెస్టోలు అన్న సూత్రం ఆధారంగా జనసేన ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం మాత్రం హర్షణీయమనే చెప్పాలి.
మరి ఈ విషయంలో పవన్ ఒక మంచి ముందడుగు వేసి కొత్త పంధాకి నాంది పలకబోతున్నాడనే చెప్పవచ్చు. మరి ఇది ఆచరణలో సాధ్యమేనా? నిజంగా సాద్యం చేయగలిగితే మాత్రం పవన్‌కే ఈ ఘనత దక్కుతుంది. కానీ సినిమాలలో చూపించినంత సులభంగా వాస్తవరాజకీయాలలో ఇది ఉండదు. మరి ఈ అసాధ్యాన్ని జనసేనాని సుసాధ్యం చేస్తాడేమో చూడాలి? ఎందుకంటే పవన్ ట్రెండ్‌ని ఫాలో అవ్వడు. ట్రెండ్ సృష్టిస్తాడు అనేది సినిమాలలోనే కాదు. రాజకీయాలలో కూడా సాధ్యమేనని ఆయన నిరూపిస్తాడని భావిద్దాం.