బాహుబలి లాంటి చరిత్రలో గుర్తుపెట్టుకునే చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సన్నాహాల్లో ఉన్నాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ఏడాదిన్నర సమయం తీసుకుంటున్న రాజమౌళి దానిని భారీ మల్టీస్టారర్ గా 250 నుండి 300 కోట్ల భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా వున్న రాజమౌళి ఈ సినిమాని వచ్చే అక్టోబర్ లో పట్టాలెక్కించబోతున్నాడు. అయితే ప్రీ ప్రొడక్షన్ తో పాటుగా ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి, రాజమౌళి హీరోయిన్స్ ని వెతికే పనిలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.
మహానటి సినిమా చూశాక కీర్తి సురేష్ ని తన మల్టీస్టారర్ లో హీరోయిన్ గా తీసుకోవాలని రాజమౌళి అనుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో చేసిన నటనకు రాజమౌళి ఫిదా అవడంతో కీర్తి సురేష్ అనుకున్నట్లుగా అన్నారు. ఇక కీర్తి సురేష్ ని ఎవరికీ అంటే ఎన్టీఆర్ సరసన... లేదంటే రామ్ చరణ్ సరసన అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇక తాజాగా రాజమౌళి చూపు మరో హీరోయిన్ మీద పడినట్లుగా ప్రచారం జరుగుతుంది. డీజే సినిమాతో సునామీలా టాలీవుడ్ లో పాతుకుపోయి... టాప్ హీరోయిన్ చైర్ కి దగ్గరలో ఉన్న పూజా హెగ్డే ని రాజమౌళి తన సినిమా కోసం ఎంపిక చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ లో కీర్తి సురేష్, పూజా హెగ్డే లు ఉన్నారు. అందుకే రాజమౌళి మనసులో వీళ్ళ పేర్లు మెదులుతున్నాయనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ప్రస్తుతం మహానటితో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగి కోలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లలో భాగమైంది. ఇక పూజా హెగ్డే ప్రస్తుతం నటించిన సాక్ష్యం సినిమా విడుదలవుతుండగా ... ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాలోనూ, మహేష్ 25వ సినిమాలోనూ, ప్రభాస్ కొత్త చిత్రంలోనూ అమ్మడు నటిస్తూ ఒక్కసారిగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశం పట్టేసి బిజీ తారగా మారడంతో.. రాజమౌళి.. పూజా హెగ్డే వైపు మొగ్గుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ హీరోయిన్ ని ఎవరికీ సెట్ చేస్తాడో అనేది కూడా సస్పెన్సే.