వాస్తవానికి నిన్నటితరంలో సూపర్‌స్టార్ కృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఉండేది. ఆ తర్వాత బాలకృష్ణ సంక్రాంతి మొనగాడుగా నిలుస్తూ వచ్చాడు. ఇటీవల రెండు సంక్రాంతులకు విడుదలైన 'గౌతమీ పుత్ర శాతకర్ణి', 'జైసింహా' చిత్రాలు కూడా సంక్రాంతికి బాలయ్యకు తిరుగేలేదని నిరూపించాయి. అయితే కిందటి సంక్రాంతి పోటీలో పవన్ 'అజ్ఞాతవాసి' దారుణంగా ఉండటం బాలయ్యకు బాగానే కలసి వచ్చి యావరేజ్ చిత్రం కూడా ఓ మోస్తరు లాభాలనే సాధించింది. ఇదే సెంటిమెంట్‌తో బాలయ్య ప్రస్తుతం తాను క్రిష్ దర్శకత్వంలో తన తండ్రి బయోపిక్‌గా రూపొందుతూ, బాలయ్య మొదటి సారిగా నిర్మాత అవతారం ఎత్తుతున్న 'ఎన్టీఆర్' చిత్రం కూడా వచ్చే సంక్రాంతికి విడుదల ఖాయమని బాలయ్య ప్రకటించాడు. మొన్నటి సంక్రాంతిలో నందమూరి బాలయ్యకు పోటీగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వచ్చి హిట్ కొట్టలేకపోయాడు. ఇక వచ్చే సంక్రాంతికి ఆ బాధ్యతలను రామ్‌చరణ్ తీసుకున్నాడు.
ప్రస్తుతం రామ్‌చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా, వివేక్ ఒబేరాయ్, ప్రశాంత్, స్నేహ, ఆర్యన్‌రాజేష్ వంటి వారితో కలిసి ఓ చిత్రం చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయింది. తాజాగా హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ 10రోజుల పాటు జరుగుతోంది. బోయపాటి చిత్రాలు హైఓల్టేజ్‌తో పక్కా మాస్, ఊర యాక్షన్ తరహాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా మిక్స్ చేస్తూ వస్తుంటాయి. బోయపాటి చిత్రం అంటే ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని అందరి నమ్మకం. దానికి తోడు ఇందులో అన్నవదినల సెంటిమెంట్‌ని కూడా బాగా రంగరిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లు మంచి ట్విస్ట్‌తో అందరినీ అలరిస్తాయని తెలుస్తోంది.
మరోవైపు డివివి దానయ్య 'భరత్ అనేనేను' వంటి బ్లాక్‌బస్టర్‌తో పాటు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌ని కూడా చేస్తూ జోరుమీదున్నాడు. ఇక బోయపాటి శ్రీను సత్తా ఏమిటో నందమూరి అభిమానులకు, బాలయ్యకు కూడా తెలుసు. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్న క్రిష్ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతానికి సంక్రాంతి పోటీకి రెడీ అవుతున్న ఈ రెండు చిత్రాలలో ఏది పైచేయి సాధిస్తుందో వేచిచూడాల్సివుంది. ఎన్టీఆర్ చిత్రం జనవరి 9న, రామ్‌చరణ్ చిత్రం 11న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి 'రంగస్థలం' ఊపు మీదున్న రామ్‌చరణ్ బాలయ్యకి ఏమాత్రం పోటీ ఇస్తాడో చూడాలి.