ప్రపంచవ్యాప్తంగా బిగ్‌బాస్ షోలను ముఖ్యంగా బాలీవుడ్ బిగ్‌బాస్‌షోలను తమ సినిమాల ప్రమోషన్‌కి వాడుకోవడం కోసం ఆయా చిత్ర నటీనటులు, దర్శకనిర్మాతలు హాజరవుతూ ఉంటారు. ఇక తమిళ బిగ్‌బాస్‌ని ఏకంగా కమల్‌హాసనే హోస్ట్ చేస్తున్నాడు. మరోవైపు ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'విశ్వరూపం2'ని ఆగష్టు10న పంద్రాగస్టు కానుకగా విడుదల చేయనున్నారు. ఇక కమల్ తమిళ ప్రమోషన్‌ని ఎలాగైనా చేసుకుంటాడు. అందునా తానే హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్‌లో తన సినిమానే ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి అని భావించాడో ఏమో ఆయన తాజాగా బాలీవుడ్ ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేస్తున్న 'దస్ కా దమ్' లో పూజాకుమార్‌తో కలిసి హాజరై, సందడి చేశాడు. సల్మాన్‌తో లోకనాయకుడు చేసిన సందడి ఎపిసోడ్ ఈ వారాంతంలో ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ..భాయ్ అంటే ఇలా ఉండాలి. చాలా ఏళ్ల తర్వాత నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది సల్మాన్‌ఖాన్.. అంటూ వ్యాఖ్యానిస్తూ ఈ షోలో తాను పూజాకుమార్.. సల్మాన్‌తో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. మరోవైపు కమల్ చిత్రాలు తెలుగులో కూడా భారీగా విడుదల అవుతూ ఉంటాయి. అందునా 'విశ్వరూపం1' తమిళంలో కంటే తెలుగులోనే మంచి హిట్ అయింది. ఈ నేపధ్యంలో కమల్ తెలుగులో కూడా త్వరలో భారీ ప్రచారం చేపట్టనున్నాడని తెలుస్తోంది. బహుశా ఆయన నాని హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్2కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ చిత్రం 2015లోనే విడుదల కావాల్సి వుంది. కానీ ఆర్దిక, సాంకేతిక కారణాల వల్ల ఇంత ఆలస్యం అయింది. చివరకు ఈ చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్‌రవిచంద్రన్ నుంచి కమల్ ఈ చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక ఈ చిత్రంలో కమల్, పూజాకుమార్‌తో పాటు ఆండ్రియా, శేఖర్‌కపూర్, వహిదా రెహ్మాన్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. మరి మొదటి పార్ట్ సాధించినట్లుగా ఈ సీక్వెల్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది...! ఇందులో కమల్ 'రా' ఏజెంట్‌గా నటిస్తుండటం విశేషం.