ఈమధ్యకాలంలో సంగీత దర్శకులు హీరోలుగా ప్రయత్నించడం అనేది షరామామూలు అయిపోయింది. ఈ సంస్కృతి మొదలైంది దేవిశ్రీప్రసాద్ తోనే.. అయిదారేళ్ళ క్రితమే దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయమవుతాడు, ఆ సినిమాలో ఛార్మీ హీరోయిన్ అనే వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. మనోడు హీరో అవ్వలేదు లెండి, ఇకపై అవుతాడో లేదో కూడా తెలియదు. అయితే.. దేవిశ్రీప్రసాద్ ను స్ఫూర్తిగా తీసుకొని తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా మారి మంచి సక్సెస్ లు అందుకొన్నాడు. ఇక మరో తమిళ సంగీత మాంత్రికుడు జి.వి.ప్రకాష్ ఇప్పటికే హీరోగా రాణిస్తున్నాడు. ఆ తర్వాత యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ హిప్ హాప్ తమిళ కూడా 'మీసయ్య మురుక్కు' అంటూ హీరోగా మాత్రమే కాక దర్శకుడిగానూ మారి మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నాడు.
వీళ్ళందర్నీ చూశాక ఇంట్రెస్ట్ పెరిగిందో లేక ముందు నుంచి హీరో అవ్వాలన్న కోరిక ఉందో తెలియదు కానీ.. మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ కూడా ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. తన మాతృభాష అయిన మలయాళంలోనే 'టోల్ గేట్' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్నాడు గోపీసుందర్. ఈ చిత్రానికి హరికృష్ణన్ దర్శకత్వం వహించనున్నాడు. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వలె.. తాను నటిస్తున్న సినిమాకి తానే స్వయంగా సంగీతం సమకూర్చుకోనున్నాడు గోపీసుందర్.
మరి హీరో అయ్యాక విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ ల వలె వేరే సినిమాలకి సంగీతం అందించడం మానేసి హీరోగా మాత్రమే కంటిన్యూ అవుతూ.. తన సినిమాకి మాత్రమే మ్యూజిక్ అందిస్తాడో లేక హిప్ హాప్ తమిళ తరహాలో రెండు పడవల ప్రయాణం చేస్తాడో వేసి చూడాలి.