'పోయిన చోటే వెతుక్కోవాలి' అనే సామెతను ఈ యువ నిర్మాత కాస్త సీరియస్ గా తీసుకొన్నట్లున్నాడు. అందుకే.. ఏ సినిమా ఇండస్ట్రీలో అయితే నిర్మాతగా మూడు కోట్ల రూపాయలు నష్టపోయాడో.. అదే సినిమా ఇండస్ట్రీలో మరో సినిమాతో ఏకంగా అయిదు కోట్ల రూపాయల లాభాన్ని అందుకొన్నాడు. శ్రీనివాసరెడ్డి హీరోగా 'జంబలకిడిపంబ' చిత్రంతో భారీగా నష్టపోయిన రవి అనే నిర్మాత అనంతరం 'ఆర్ ఎక్స్ 100' చిత్రాన్ని హోల్ సేల్ గా కొనేసి.. సినిమా మీద నమ్మకంతో అన్నీ ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేసుకొన్నాడు.
సినిమాకి ట్రైలర్ పుణ్యమా అని భీభత్సమైన ఓపెనింగ్స్ లభించగా.. విడుదలయ్యాక హీరోయిన్ పాయల్ రాజ్ పుట్ అందాలు, కథలోని ట్విస్ట్ కి యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో తొలివారంలో ఏకంగా అయికోట్ల షేర్.. 9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచింది. దాంతో.. 'జంబలకిడిపంబ' చిత్రంతో పోగొట్టుకొన్నదానికి రెండింతల సొమ్ము 'ఆర్ ఎక్స్ 100' చిత్రంతో సంపాదించాడు సదరు నిర్మాత.
ఇలా అందరికీ కుదరకపోయినప్పటికీ.. రవికి బాగా సెట్ అవ్వడంతో తమకి అలా అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందా అని నిర్మాతలందరూ ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో చూడాలి. అలాగే.. ఈ లాభాలతో రవి మరో చిత్రాన్ని రూపొందించి హిట్ కొడతాడా లేదా పోగొట్టుకొన్న డబ్బు వచ్చింది కాబట్టి సైలెంట్ అయిపోతాడా అనేది కూడా చూడాలి.