మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'విజేత'. రాకేశ్‌శశి దర్శకత్వంలో వారాహిచలన చిత్రం పతాకంపై సాయికొర్రపాటి నిర్మించిన చిత్రం బాగానే ఉందని టాక్ తెచ్చుకున్నా ఓపెనింగ్స్ చాలా డల్‌గా ఉన్నాయి. ఇక సోమవారం నుంచి పరిస్థితి మరింత దిగజారింది. మెగాభిమానులు కళ్యాణ్‌దేవ్‌ని మెగా హీరోగా ఓన్ చేసుకోలేకపోయారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ అడగటంతో ఈ చిత్రాన్ని ఏడెనిమిది కోట్లతో నిర్మించిన సాయికొర్రపాటికి భారీగా నష్టాలు తప్పవని తేలిపోయింది. మరి ఈ నష్టాలను ఎవరు భర్తీ చేస్తారో చూడాలి...!
మరోవైపు చిరంజీవి, రామ్‌చరణ్, బన్నీలు ప్రమోట్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా కళ్యాణ్‌దేవ్ నెల్లూరు లో టీమ్ కలిసి టూర్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు చిన్ననాటి నుంచి కళలంటే బాగా ఇష్టం. కాలేజీ రోజుల్లో కూడా కాంపిటీషన్స్‌లో బాగా పాల్గొని బహుమతులు గెలుచుకునే వాడిని. నా ఉత్సాహాన్ని చూసిన మావయ్య చిరంజీవి సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకోమని సలహా ఇచ్చాడు. మూడు నెలలు వైజాగ్ సత్యానంద్ గారి వద్ద శిక్షణ పొందాను. అప్పుడే రాకేష్‌శశి ఈ కథను సిద్దం చేసుకుని సత్యానంద్‌ని కలిశారు. ఆయనకు సత్యానంద్ నన్ను పరిచయం చేశాడు. రాకేష్‌శశి చెప్పిన కథ నచ్చడంతో మావయ్యకి చెప్పించాను.
ఆయనకు కూడా బాగా నచ్చడం, వెంటనే చిత్రం ప్రారంభం జరిగిపోయాయి. మావయ్యగారి బ్లాక్‌బస్టర్ మూవీ 'విజేత' టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టడం వల్ల భయం వేసింది. కానీ సినిమా చూసిన మావయ్య బాగుందని చెప్పడంతో దైర్యం వచ్చింది. నెల్లూరులో మెగాభిమానులు ఇంతగా మెగా హీరోలను, నన్ను కూడా ఆదరించడం సంతోషంగా ఉంది.. అని చెప్పుకొచ్చాడు.