వాస్తవానికి ఇప్పటికి కూడా అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శత్వంలో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్‌ని చాలా మంది విశ్లేషకులు పెదవి విరుస్తూ యావరేజ్ కంటెంట్ ఉన్న చిత్రంగా చెబుతూ వస్తున్నారు. కానీ ఈ చిత్రం విమర్శకులను, విశ్లేషకులను మెప్పించలేకపోయినా సామాన్య ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. 2016లో వచ్చిన ఈ చిత్రం 50కోట్ల బడ్జెట్‌తో రూపొందగా మొత్తంగా 127కోట్లను వసూలు చేసింది. రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బేనర్‌లోనే నిర్మించడం విశేషం.
ఇక ఈ చిత్రం తాజాగా భారతదేశంలో ఇప్పటి వరకు ఏ చిత్రం సాధించని రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఈ మూవీ హిందీ వెర్షన్‌ని తాజాగా 20కోట్ల మంది వీక్షించారు. ఇలా 200మిలియన్లు దాటిన మొదటి చిత్రంగా ఇది రికార్డులను క్రియేట్ చేసింది. 200,798,188 మంది ఈ చిత్రాన్ని వీక్షించగా ఆరు లక్షల మందికి పైగా దీనిని లైక్ చేశారు. గతంలో ఏ భారతీయ చిత్రం సాధించని రికార్డును ఇది సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం యూట్యూబ్ వెర్షన్‌ని కొనుగోలు చేసిన గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ సంస్థకి ఇది లాభాల వర్షం కురిపించింది. ఇందులో గుణ అనే పవర్‌ఫుల్ పాత్రలో అల్లుఅర్జున్ నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా బన్నీకి పోటాపోటీగా నటించాడు.
ఈ చిత్రం ద్వారా ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా తెలుగు చిత్రాల హవా ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది. ముఖ్యంగా మన మాస్, యాక్షన్ చిత్రాలకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారని మరోసారి నిరూపితం అయింది. మరి దీని వల్ల రాబోయే బన్నీ చిత్రాలకు యూట్యూబ్ రైట్స్ భారీ రేటును పలకడం గ్యారంటీ అనే చెప్పాలి.