దక్షిణాది హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఆమె సీనియర్ స్టార్స్ నుంచి యంగ్ స్టార్స్ వరకు అందరితో కలిసి నటించింది. తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలతో తన సత్తా చాటింది. తాజాగా ఈమె మొదటి సారిగా ఓ మలయాళ చిత్రంతో కూడా తెరంగేట్రం చేస్తోంది. ఒకానొక దశలో ఆమె ఫేడవుట్ అయింది. దాంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. నిశ్చితార్దం కూడా జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది బ్రేకప్ అయింది. ఈ నిశ్చితార్ధం పూర్తయిన తర్వాత త్రిష మరలా అనూహ్యంగా పుంజుకుంది. ఆమె చేతిలో ప్రస్తుతం అరడజను వరకు చిత్రాలు ఉన్నాయి. 'సామి2' వంటి చిత్రంలో అవకాశం వచ్చినా వదిలేసేంతగా ఆమె బిజీగా మారింది. అయితే ఈమద్య కాలంలో ఆమె తెలుగులో నేరుగా కనిపించడం లేదు. తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాలు, తమిళ డబ్బింగ్ చిత్రాలతో మాత్రమే తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇక ఈమె ఇటీవల లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కమల్‌హాసన్‌తో నటించిన 'చీకటిరాజ్యం', లేడీ ఓరియంటెడ్ చిత్రాలుగా వచ్చిన 'కళావతి, నాయకి' చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఇక తన జీవితలక్ష్యం ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించడమేనని ఆమె పేర్కొంది. అలాంటి చిత్రం కోసం ఆమె ఎదురు చూస్తోంది. కాగా త్రిష ప్రధాన పాత్రలో నటించిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'మోహిని' చిత్రం రెండు భాషల్లో అదే పేరుతో ఈనెల 27న విడుదలకు సిద్దమవుతోంది. మాదేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది.
ఇటీవల హర్రర్, థ్రిల్లర్ చిత్రాలలో కూడా సామాజిక సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు సమంత నటించిన 'రాజుగారి గది2'ని చెప్పుకోవచ్చు. ఆ చిత్రం తరహాలోనే 'మోహిని' చిత్రం కూడా ఒక సామాజిక సమస్యను టచ్ చేస్తూ సాగుతోందని దర్శకుడు మాదేష్ నమ్మకంగా చెబుతున్నాడు. ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చిపెట్టిన నిజం.. అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అయింది. ఈ చిత్రంలోని సామాజిక అంశం అందరికి కనెక్ట్ అయ్యేలా, హృదయాలను టచ్ చేసేలా, మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని యూనిట్ చెబుతోంది. మరి ఈ చిత్రంతోనైనా త్రిష లేడీ ఓరియంటెడ్ చిత్రంతో హిట్ కొడుతుందా? మెప్పిస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..!