ఎవరు ఉన్నాయి అని చెప్పినా, లేదు అని వాదించినా కూడా సినిమా రంగంలో ఇతర రంగాలకంటే లైంగిక వేధింపులు ఎక్కువేనని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇక సినీ రంగంలోని వారికే కాదు.. ఈ దేశంలో ప్రతి రంగంలోనూ ఇవి ఉన్నాయనేది కూడా వాస్తవమే. కానీ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి వల్ల ఈ విషయంలో ప్రతి దానికి పరిశ్రమ సాఫ్ట్‌కార్నర్‌గా మారింది. ఇక విషయానికి వస్తే మణిరత్నం తీసిన 'చెలియా' చిత్రంలో నటించిన హీరోయిన్ అదితీరావు హైదరి. మణిరత్నం చిత్రం అంటే అందులో ఆయన సినిమా జయాపజయాలకు అతీతంగా ఎంతో అందంగా హీరోయిన్లను చూపిస్తాడు. ఐశ్వర్యారాయ్ నుంచి అదితీరావు హైదరి వరకు ఇదే కోవకి వస్తారు. ఇక స్వతహాగా హైదరాబాదీనే అయిన అదితి ఆ తర్వాత బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'పద్మావత్' చిత్రంలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.
ఇక తాజాగా ఆమె ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటించిన 'సమ్మోహనం' చిత్రం ద్వారా మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. భవిష్యత్తులో ఈమె టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఇక తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, లైంగిక వేధింపులు, కాస్టింగ్‌కౌచ్‌పై నోరు విప్పింది. నాకు చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. నేను చిన్నప్పుడు స్కూల్‌కి రైలులో వెళ్లేదానిని. ఓ సారి ఓ పెద్దాయన నన్ను తాకరాని చోట తాకాడు. దాంతో నేను ఆయన వైపు డర్టీగా చూస్తూ 'ఇక ఎవరిని ఇలా బ్యాడ్‌గా టచ్ చేయవద్దు అంకుల్' అని వార్నింగ్ ఇచ్చాను. ఆ తర్వాత మరలా అలాంటి పరిస్థితి రాలేదు.
ఏది మంచి.. ఏది చెడు అనే విషయం అమ్మాయిలకు తల్లిదండ్రులే చెప్పాలి. నా తల్లిదండ్రులు నన్ను మొదటి నుంచి ఎంతో కాపాడుతూ, రక్షణగా నిలుస్తూ ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. లైంగిక వేధింపులపై మాట్లాడితే టాలీవుడ్‌లో అవకాశాలు రావనే పరిస్థితి ఉందనేది నిజమే. సినిమా ఫీల్డ్‌లో నటీమణులను ఆట వస్తువులుగా కాకుండా కళాకారులుగా చూస్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పురాదని ఆమె చెప్పుకొచ్చింది. ఈమె చెప్పింది మాత్రం అక్షరాలా సత్యమనే చెప్పాలి.