నేటిరోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే నమ్మే జనాలు ఉన్నారు. ఇక కొన్ని చిత్రాలలో చూపించిన విధంగా పక్కా సినీ ఫక్కీలోనే కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. ఉదాహరణకు 'ఇంద్ర, బద్రినాథ్' తరహా చిత్రాలలో బ్రహ్మానందం మాదిరిగా ఓ నకిలీ స్వామిజీ ఎవరినైనా ఇట్టే బురిడి కొట్టించి, వారి చేత ఉన్న బంగారం మొత్తాన్ని ఓ చెంబులో పెట్టి 60రోజుల తర్వాత దానిని రెట్టింపు చేస్తానని నమ్మబలుకుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈయన వద్ద నుంచి రెండు కిలోల బంగారం, కోటి రూపాయల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసుల కథనం ప్రకారం...శివోహం రామానుజం అలియాస్ రామ శివ చైతన్యం స్వామిజీ స్వస్థలం కేరళలోని కలాడి. తత్వవేదం పీఠాధిపతిగా తనకు తాను చెప్పుకునే ఈయన కొన్నాళ్లు కలాడి శివోహం జ్ఞానగురు పీఠంలో ఉన్నాడు. 1999లో అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఆ స్వామిజీ బోయినపల్లిలో మకాం వేశాడు. వివిధ దేవాలయాల్లో జరిగిన యజ్ఞయాగాదులలో పాల్గొన్నాడు. 2009లో బోయిన పల్లికే చెందిన తేజస్విని అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి బాబు, పాప సంతానం.
ఆతర్వాత కొంతకాలానికి యూసఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద అద్దె ఇల్లు తీసుకుని అందులోకి మకాం మార్చాడు. తత్వపీఠం పేరుతో ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాడు. ఎవరైనా పూజలు చేయమంటే లక్షలు వసూలు చేసేవాడు. కానీ ఆయనకు ఉన్న డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఆయన మాయలో పడిన వారిలో ఎక్కువగా ధనవంతులే ఉన్నారట. వారి నుంచి ఒక్కో పూజకు రెండు నుంచి 20లక్షలు వసూలు చేసేవాడు. పూజలు ముగిసన తర్వాత ఇంట్లోని నగలన్నింటినీ ఓ చెంబులో వేసి దేవుడి గదిలో ఉంచమనేవాడు. ఆ మూతను ఎవ్వరూ తీయకూడదని, 60రోజుల తర్వాత తానే తీస్తానని గట్టిగా హెచ్చరించేవాడు. అప్పటికి బంగారం రెట్టింపు అవుతుందని నమ్మబలికేవాడు. ఆ తర్వాత అందరూ కళ్లు మూసుకుని ప్రార్ధించాలని చెప్పేవాడు. ఈ క్రమంలో తన భార్య చేత ఆ నగలు ఉన్న చెంబుని తమ సంచిలో వేసుకుని ఇంటి నుంచి తాము తెచ్చిన అదే తరహా చెంబును అక్కడ ఉంచేవాడు.
ఇప్పటివరకు ఇలా 11మంది ధనవంతులను మోసం చేసి కోట్లు సంపాదించాడు. రెండు కిలోల బంగారం, కోటి రూపాయల నగదుని సంపాదించాడని తెలిసిన పోలీసులు ఆయన వద్ద నుంచి వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ కారును కూడా పోలీసులు ఆ దొంగ బాబా, ఆయన భార్య తేజస్విని నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి బురిడీ బాబాల చేతుల్లో పడితే ఇల్లు గుల్ల కావడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.