ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలో జగన్ 'ప్రజా సంకల్ప యాత్ర'ను చేస్తుంటే పవన్‌కళ్యాణ్ 'పోరాటయాత్రలు' చేస్తున్నాడు. ఇక నాడు జగన్ కేసును పరిశోధించి, జగన్‌ని మూడు చెరువుల నీరు తాగించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పలు ప్రదేశాలలో పర్యటిస్తూ రైతుల సమస్యలపై వారి అభిప్రాయాలు వింటూ వస్తున్నాడు.
తాజాగా ఆయన కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లులో రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నాది రైతుల పార్టీ. నాకు ఏ ఇతర పార్టీలతోనూ సంబంధం లేదు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాను. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. పరిష్కారం లభించకపోతే రెండో దశలో మహారాష్ట్ర తరహాలో 40వేల మంది రైతులతో పాదయాత్ర చేస్తానని ప్రకటించాడు. కార్పొరేట్ సంస్థల వల్లే రైతులు నష్టపోతున్నారని, రైతులు సంఘిటితంగా ఉంటే కార్పొరేట్ సంస్థలను నిలువరించవచ్చని ఆయన సూచించారు.
ఇక జెడి లక్ష్మీనారాయణ విషయానికి వస్తే ఆయన బిజెపిలో చేరతాడని, కాదు.. కాదు.. జనసేనలో చేరుతాడని పలు వార్తలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కకుండా ఒంటరిగా రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ, రైతులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాడు. మరి లక్ష్మీనారాయణ సొంతగా రైతుల కోసం ఓ పార్టీని పెడతాడా? వేరే వారి పార్టీలో చేరుతాడా? అనేది మాత్రం వేచిచూడాల్సివుంది...!