మెగా ఫ్యామిలీ నుండి వారసులు పుట్ట గొడుగుల్లా పుడుతూనే ఉన్నారు. కేవలం మెగా ఫ్యామిలీ రక్తసంబంధీకులే కాదు.. ఆ ఇంటికి అల్లుళ్లుగా వచ్చిన వారు కూడా హీరోలైపోతున్నారు. ఎన్ని బిజినెస్ లు ఉన్నప్పటికీ... సెలెబ్రిటీ అనే హోదా మామూలుది కాదుకదండి. అందుకే అందరికి హీరోలవ్వాలనే కోరిక బలంగా వచ్చేస్తుంది. అయితే కేవలం మెగా ఫ్యామిలీ ఆశీస్సులు అండదండలు ఉంటే సరిపోతుందా.. వాళ్లలో టాలెంట్ కూడా ఉండాలి. మరి మెగా ఫ్యామిలీ నుండి చిరు తర్వాత వచ్చిన పవన్ కి భారీ క్రేజ్ ఉంది. ఇక ఆ తర్వాత కేవలం రామ్ చరణ్ కి అలాగే అల్లు అర్జున్ కి మాత్రమే స్టార్ హోదా ఉంది. మిగతా మెగా హీరోలు హీరోలుగా నిలబడడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ వంటి హీరోలు ఉండగా.. ఇపుడు కొత్తగా చిరు చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరో గా వచ్చి చేరాడు.
కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన విజేత సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి సినిమాని ప్రమోట్ చేస్తున్నప్పటికీ... విజేత మాత్రం కోలుకునే పరిస్థితి అయితే లేదు. కళ్యాణ్ దేవ్ ఒక రొటీన్ ఫార్ములా ఉన్న కథని ఎన్నుకుని తన మొదటి సినిమా చేసాడు. కానీ కథలో బలం లేకపోవడంతో.. విజేత కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇక ప్రమోషన్స్ తో నిలబెడదామనుకున్నా... ఆ సినిమాకి కలెక్షన్స్ రావడం కలలాగే కనబడుతుంది. ఎందుకంటే కళ్యాణ్ దేవ్ తో పాటు బాక్సాఫీసు వద్ద పోటీకి దిగిన కార్తికేయ అనే కొత్త కుర్రాడు RX 100 తో యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... తర్వాత ఆ సినిమా యూత్ కి కనెక్ట్ అవడంతో.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాడు.
తాజాగా నిన్న కార్తీ చినబాబు సినిమాకి హిట్ టాక్ రావడం కూడా కళ్యాణ్ దేవ్ విజేత సినిమా కలెక్షన్స్ పడిపోవడానికి కారణమైంది. మరి మెగా ఫ్యాన్స్ ఒక చెయ్యి అందించినా కళ్యాణ్ దేవ్ సినిమా బాగా ఆడాల్సింది. కానీ ఇక్కడ మెగా ఫాన్స్ కి కళ్యాణ్ దేవ్ ని హీరో చెయ్యడం ఇష్టం లేదో... లేదంటే కళ్యాణ్ దేవ్ హీరోగా వారికి అనిపించకో గాని వారు సైలెంట్ అవడం ఇప్పుడు కళ్యాణ్ దేవ్ కి కష్టంగానే మారింది. మరి మెగా అభిమానుల సపోర్ట్ లేదనేది విజేత కొచ్చే కలెక్షన్స్ బట్టి తెలిసిపోతుంది. ఇక కళ్యాణ్ దేవ్ మరో సినిమా మొదలెట్టే ముందు అన్ని ఆలోచించుకుని దిగితే బెటర్ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.